Chandrababu : పవర్ పోయింది కానీ, పవర్ సెక్టార్‌లో సంస్కరణలు ఉన్నాయి!
పవర్ పోయింది కానీ, పవర్ సెక్టార్‌లో సంస్కరణలు ఉన్నాయి!
విద్యుత్(Electriicty) అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఎప్పటిలాగే ఆత్మస్తుతి చేసుకున్నారు. వపర్ సెక్టార్‌లో(Power sector) విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది తానేనని ఘనంగా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలకు లక్షా 29 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందో ఈ లెక్కలు చెబుతున్నాయని పరనింద చేశారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని హితవు చెప్పారు. 2004లో తన పవర్ పోయింది కానీ పవర్ సెక్టార్‌లో తాను తీసుకొచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సంస్కరణల కారణంగానే విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడిందని చెప్పారు. 2019-2024 మధ్యకాలంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదని, అసమర్థ నిర్ణయాల కారణంగా ప్రజలపై భారం పడిందని, సోలార్ విద్యుత్ వాడుకోకుండా 9 వేల కోట్ల రూపాయలు చెల్లించారని ఏపీ సీఎం అన్నారు. అయిదేళ్లలో మొత్తం 32,166 కోట్ల రూపాయల భారం ప్రజలపై అదనంగా పడిందని చంద్రబాబు అన్నారు. గృహ వినియోగదారులపై 8,180 కోట్ల రూపాయల భారం పడిందని చెప్పారు. చేతకాని పరిపాలన కారణంగా మొత్తం విద్యుత్ సంస్థలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.