Amaravati Chandrababu: 4,400 కోట్ల కుంభకోణం.. చంద్రబాబుపై చార్జిషీట్ దాఖలు
ఈ భూముల కేసు 2020లో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నమోదైంది. అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు
4,400 కోట్ల అమరావతి భూ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి నారాయణ తదితరులను పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసు నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. 4,400 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను తెలుగుదేశం పార్టీ నేతలు నారాయణ, ఏ సుధీర్ బాబు, కేపీవీ అంజనీ కుమార్‌లు లాక్కున్నారని సీఐడీ ఆరోపిస్తోంది.
అమరావతి అసైన్ మెంట్ భూముల వ్యవహారంలో రూ.4,400 కోట్ల మేర కుంభకోణం జరిగిందని.. ఇందులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా, మాజీ మంత్రి నారాయణ, సుధీర్ బాబు, అంజనీకుమార్ లను ఇతర నిందితులుగా సీఐడీ చెబుతోంది. రాజధాని నగర ప్లాన్ పేరిట చంద్రబాబు తదితరులు 1,100 ఎకరాల స్థలం కొట్టేశారని.. అందుకోసం భూ రికార్డులను తారుమారు చేశారని చార్జిషీట్ లో సీఐడీ ఆరోపించింది.
ఈ భూముల కేసు 2020లో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నమోదైంది. అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు, ఇతర మంత్రులు తమ బినామీల సాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన భూములు చేజిక్కించుకున్నారని సీఐడీ తెలిపింది. వారికి ఎలాంటి ప్యాకేజి చెల్లించలేదని, అతి తక్కువ ధరలకే ఆ భూములను లాగేసుకున్నారని ఆరోపించింది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములను రాజధాని ల్యాండ్‌పూలింగ్ పథకంలో చేర్చేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓఎంఎస్ నెం 41) జారీ చేయాలని నిందితులు ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారని చార్జిషీట్‌లో దర్యాప్తు సంస్థ పేర్కొంది. నిందితులు ఉద్దేశపూర్వకంగా, సమన్వయంతో చట్టపరమైన ఆదేశాలను ఉల్లంఘించారని సీఐడీ ప్రకటన పేర్కొంది. నారాయణ కుటుంబ సభ్యులకు సంబంధించిన విద్యా సంఘాలు, సంస్థల నుంచి రూ.16.5 కోట్ల విలువైన నిధులను రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర రియల్ ఎస్టేట్ మధ్యవర్తులకు బదిలీ చేశారని, ఆ అసైన్డ్ భూముల రైతులకు అక్రమ విక్రయ ఒప్పందాలు చేసి నారాయణ బినామీల పేరుతో కొనిచ్చారని సీఐడీ తెలిపింది. నారాయణ తనకు, తన సహచరుల సహాయంతో 162 ఎకరాల వరకు అసైన్డ్ భూమిని సంపాదించారని, చంద్రబాబు నాయుడు సన్నిహితులు రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా సంపాదించారని దర్యాప్తు సంస్థ తెలిపింది.