నేడు ఢిల్లీకి చంద్రబాబు.. 2014ని రిపీట్ చేయాలనేమో!!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2014లో టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తుతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన సంగతి తెలిసిందే!! అయితే 2019కి వేరు వేరుగా పోటీ చేశారు. వైసీపీ హవా ముందు కొట్టుకుపోయారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టడానికి మరోసారి చంద్రబాబు నాయుడు 2014 వ్యూహాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడుకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి అమిత్ షా నివాసంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారు. గురువారం జరిగే చర్చల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళతారు. ఈరోజు రాత్రికి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని తెలిసింది. రేపు కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే ఏపీలో జనసేన-టీడీపీ మధ్య పొత్తు ఉంది. సీట్లకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి.

Updated On 6 Feb 2024 9:35 PM GMT
Yagnik

Yagnik

Next Story