Chandrababu Naidu:చంద్రబాబుకు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు?
ఉన్నత పదవిలో ఉన్నవారు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.
ఉన్నత పదవిలో ఉన్నవారు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఇష్టానికి మాట్లాడితే మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(CM Chandrababu Naidu) తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ తిరుమల లడ్డూ(Tirumala Laddu)పై ఓ తప్పుడు వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నీచాతినీచంగా మాట్లాడారనే విమర్శలు ఆల్‌రెడీ మొదలయ్యాయి. అది ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp)నుంచే కాదు, ప్రజల నుంచి కూడా! ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే 'తిరుమల ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసింది. నెయ్యికి బదులు ఆనిమల్ ఫ్యాట్(Animal Fat) వాడారని తెలిసింది. మేము స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నాం' అని కామెంట్స్ చేశారు. ఆయన ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు. తిరుమల ప్రసాదానికి సంబంధించి తన దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వెంటనే చర్య తీసుకోవాలి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై బురద చల్లడానికి నిరాధార ఆరోపణలు చేయడం సబబు కాదని కొందరు అంటున్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూను అడ్డం పెట్టుకుని వైసీపీ విమర్శించాలనుకోవడం సరికాదంటున్నారు. కోట్లాది మంది హిందువులకు తిరుమల ఓ పవిత్ర పుణ్యక్షేత్రం. వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రసాదంపై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మంచిది కాదని హితవు చెబుతున్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి(Yv SubbaReddy), భూమన కరుణాకరరెడ్డి(Bhumana karunakara Reddy) ఘాటుగా స్పందించారు. 'తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి ఆరోపణలు చేయరు' అని వైవీ సుబ్బారెడ్డి ఫైరయ్యారు. 'శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థకోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాలమీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతులమీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాలమీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే.. ఆయన బురద రాజకీయాలకు పరాకాష్ట' అని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బ తీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?' అని వై.ఎస్.సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. నిజమే చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలి. నిజమేమిటో లోకానికి తెలియచెప్పాలి.. మరి చంద్రబాబు అందుకు సిద్ధంగా ఉన్నారా?