జనసేనతో జతకట్టినా చంద్రబాబుకు ఘోర ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే బీజేపీతో పొత్తుకు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కూడా పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు. అందుకు కారణం టీడీపీకి ఉన్న పొత్తు కోసమే!! ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఇక బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ మూడు పార్టీల పొత్తులు ఖరారు అయ్యాకనే చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందుకే ఈ వెయిటింగ్ అని అందరికీ స్పష్టంగా తెలుస్తోంది.

చంద్రబాబు పొత్తుల వ్యవహారంపై వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని అన్నారు. జనసేనతో జతకట్టినా చంద్రబాబుకు ఘోర ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు భావిస్తే ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను సీఎం వైఎస్‌ జగన్‌ మరింత పెంచుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ పొత్తులకు వ్యతిరేకమని, ఒంటరిగా పోటీ చేయడమే తమ విధానమని అన్నారు. ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలే ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం, నిత్యం జనంతో మమేకమవడం, ప్రజలకు మంచి చేయడం సీఎం జగన్‌ సిద్ధాంతమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మళ్లీ వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమని, ప్రజలకు మరింత మేలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు.

Updated On 20 Feb 2024 11:43 PM GMT
Yagnik

Yagnik

Next Story