Chandrababu Naidu: ఆ అవసరం ఉంది కాబట్టే పొత్తు పెట్టుకున్నాం
చిలకలూరిపేటలో మార్చి 17వ తేదీన జరిగే సభ కొత్త చరిత్ర సృష్టించాలన్నారు చంద్రబాబు
జనసేన-బీజేపీ-టీడీపీ సీట్ల పంపకంపై చర్చించిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్ లెవల్ కార్యకర్తలు, నాయకులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సమాయత్తమవ్వాలని తెలిపారు. పలు సర్వేలు, నివేదికల ఆధారంగా వివిధ అంశాలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మూడు పార్టీల పొత్తు కేవలం జగన్ ను ఓడించడం కోసమే కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజేతగా నిలపడం కోసమని అన్నారు. ఏపీ పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం అవసరమన్నారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని.. 25 ఏళ్ల క్రితమే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పని చేసిందన్నారు. పోలవరం పూర్తికి, రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రసాయం ఎంతో అవసరమన్నారు చంద్రబాబు. నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. టిక్కెట్ పొందిన నేతల పనితీరుపై చివరి నిమిషం వరకు సమీక్షిస్తాం. ప్రజల్లో లేకపోయినా, మంచి పేరు తెచ్చుకోకపోయినా వారిని మార్చడానికి వెనుకాడనని హెచ్చరించారు చంద్రబాబు.
ఇక చిలకలూరిపేటలో మార్చి 17వ తేదీన జరిగే సభ కొత్త చరిత్ర సృష్టించాలన్నారు చంద్రబాబు. ప్రజల భాగస్వామ్యంతో కనీవినీ ఎరగని రీతిలో సభను విజయవంతం చేయాలని పిలుపును ఇచ్చారు. రాష్ట్రాన్ని నిలబెట్టడంలో తొలి అడుగే ఉమ్మడి సభ. ప్రధాని పాల్గొనే సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు చంద్రబాబు. మూడు పార్టీల కూటమి 160కి పైగా స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపుని ఇచ్చారు చంద్రబాబు.