JR NTR: తారక్ కు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు
ఇలాంటి సందర్భంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి
జూనియర్ ఎన్టీఆర్.. అటు సినిమాల పరంగానే కాకుండా, రాజకీయాల పరంగా కూడా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ నానుతూనే ఉంటుంది. తారక్ ఒకప్పుడు టీడీపీ కోసం ప్రచారం చేసిన వారే.. అయితే కొన్ని కారణాల వల్ల టీడీపీకి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా తమతో ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉందని చెబుతూ ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తిరిగి తీసుకోవాల్సిందేనంటూ చాలా మందే డిమాండ్లు చేస్తున్నారు. ఇక టీడీపీ సభల్లో ఎన్టీఆర్ ఫోటోలను అనుమతించలేదు. నందమూరి అభిమానులు తారక్ ను పార్టీ ప్రచారం కోసం తీసుకుని రావాలని చంద్రబాబు నాయుడును బహిరంగంగానే డిమాండ్ చేశారు.. కానీ టీడీపీ చీఫ్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. మరో వైపు తారక్ వస్తే నారా లోకేష్ కు చెక్ పెడతారనే ఆందోళన కూడా కొందరిలో ఉంది.
ఇలాంటి సందర్భంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్‌కు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కి టీడీపీతో సంబంధం లేదు. 2014, 19, 24 ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఆయన రాలేదన్నారు. అలాంటప్పుడు ఆయన పార్టీతో ఎలా సంబంధం పెట్టుకుంటారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుగారే నడిపిస్తున్నారు.. అది అలాగే ఉంటుందని బుద్దా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.