Tirumala : కొండపై వరుస వివాదాలు.. పట్టించుకునేవారే లేరా..
ఈ మధ్య కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రం అత్యధికంగా వార్తల్లో నిలుస్తోంది.

ఈ మధ్య కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రం అత్యధికంగా వార్తల్లో నిలుస్తోంది. తిరుమల ప్రసాదం గురించి మొదలైన చర్చ.. తొక్కిసలాట, కొండ గగనతలంపై విమానాల పోకడ, శ్రీవారి సన్నిధిలో ఓ వైపు ముంతాజ్ హోటల్ హడావిడి ... మారో వెైపు పాపవినాశనంలో బోటింగ్ వివాదం ఇలా వరుసగా వివాదాల బారిన పడుతుంది. తిరుమల ఏడుకొండల సన్నిధిలో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిని పట్టించుకోని ఉన్నత అధికారులు సరిచేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. తిరుమల భక్తుల దాహం తీర్చే పాపవినాశనంలో బోటింగ్ ఏంటని.. తిరుమలను పర్యాటక కేంద్రంగా చూడద్దని భక్తులు అభ్యంతరం చెప్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ... ఎక్కడికక్కడే తనిఖీలు, చీమ చిటుక్కుమన్నా కొత్త వ్యక్తులెవరొచ్చినా ఇట్టే పసిగట్టేయొచ్చు అయినా ఎవ్వరికీ తెలియకుండా శేషాచల అటవీ ప్రాంతంలో పాపవినాశనం జలాశయంలో మోటార్ బోట్ల మాక్ డ్రిల్ నిర్వహించడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. టీటీడీ, అటవీశాఖల మధ్య సమన్వయలోపంతో పవిత్ర పుణ్యక్షేత్ర ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
