Avinash Reddy: సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి
వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ
కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరిని అడ్డం పెట్టుకొని, హియర్ సే ఎవిడెన్స్ అంటూ సీబీఐ, సునీత తదితరులు కలిసి ఆడుతున్న డ్రామా అని తేల్చి చెప్పారు. అసలు దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సునీత చెబుతున్నారని అన్నారు. గూగుల్ టేకౌట్‌కు కచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగన్న నలుగురి పేర్లు చెప్పినప్పటికీ, వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదని అన్నారు.
వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి. సీబీఐ అతన్ని అరెస్టు చేయలేదు. అతనికి ముందస్తు బెయిల్ వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారన్నారు. ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టే బెయిల్ వచ్చిన తర్వాత 306 (4)బి ప్రకారం అప్రూవర్‌గా మార్చారు. అందుకే హంతకుడినని ఒప్పుకొన్న దస్తగిరి ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సహకరించి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారని అవినాష్ రెడ్డి అన్నారు. దస్తగిరి హియర్ సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారని.. అందువల్లే తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని తెలిపారు.