సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించామని

ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం సమావేశమైంది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి ఇందులో పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారుల జేఏసీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఛైర్మన్ బండి శ్రీనివాసరావు సహా 13 ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు వారి మధ్య చర్చలు సాగాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలో బకాయిలన్నింటినీ విడుదల చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంది.

బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్ అంశాలన్నింటిపైనా చర్చించామన్నారు. సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించామని అన్నారు. వీలైనంత త్వరగా పీఆర్‌సీని ప్రకటించాలని భావిస్తున్నామని వివరించారు. ఇప్పటికే పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేసినట్లు బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. ఈ నెలలో లేదా వచ్చే నెల నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని అన్నారు. దీనికోసం 5,500 కోట్ల రూపాయలు అవసరమౌతాయని, ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోన్నందు వల్ల ఈ మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామని మంత్రి బొత్స చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ డీఏ బకాయిలు, మధ్యంతర భృతి అంశాలపై చర్చించామని తెలిపారు. మార్చి 31 నాటికి రూ.5,600 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారని వెల్లడించారు. పీఆర్సీ బకాయిలపై గతంలో షెడ్యూల్ ఇచ్చారని పేర్కొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ మార్చి నెలాఖరుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పారన్నారు. ఉద్యోగులకు డీఏ బకాయిలు రూ.7,500 కోట్లు ఉన్నాయని.. సరెండర్ లీవ్ బకాయిలు రూ.2,600 కోట్లు ఉన్నాయని, ఏపీజీఎల్ఐ బకాయిలు రూ.600 కోట్లు ఉన్నాయని తెలిపారు. సీపీఎస్ రూ.2,500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారని బొప్పరాజు వెల్లడించారు. పోలీసులకు రూ.300 కోట్ల మేర బకాయిలు మార్చి 31 నాటికి చెల్లిస్తామని చెప్పారని అన్నారు. ఉద్యోగులకు మొత్తమ్మీద రూ.20 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు.

Updated On 12 Feb 2024 10:41 PM GMT
Yagnik

Yagnik

Next Story