వరుసగా రెండుసార్లు గెలిచినవాళ్లు మూడోసారి ఓడిపోతారా? గత చరిత్ర..గెలుపోటముల జాబితా అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయా? సెంటిమెంట్ ను ఆ ఎమ్యేల్యే అధిగమిస్తారా? కొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తారా? రాజకీయంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆ నియోజకర్గంలో నేతలు కూడా సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతుంటారు.

వరుసగా రెండుసార్లు గెలిచినవాళ్లు మూడోసారి ఓడిపోతారా? గత చరిత్ర..గెలుపోటముల జాబితా అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయా? సెంటిమెంట్ ను ఆ ఎమ్యేల్యే అధిగమిస్తారా? కొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తారా? రాజకీయంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆ నియోజకర్గంలో నేతలు కూడా సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతుంటారు. దీంతో ఆ సెంటిమెంట్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను వెంటాడుతోంది. ఇంతకీ ఏంటా సెంటిమెంట్‌? ఏమిటా కథ? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

కడ‌ప(Kadapa) జిల్లా క‌మ‌లాపురం(Kamalapuram Constituency) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం 1952 లో ప్రారంభ‌మైంది. కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి(YS Family) కొంత అనుకూలంగా ఉంటుంది. పది శాసనసభ నియోజకవర్గాలుంటే ఒకటో రెండో మినహాయించి మిగిలిన వాటిల్లో గెలుపు అవకాశాలు 90 శాతం ఉంటాయని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్న విషయం. గత ఎన్నికల్లోనూ కడపలో పదికి పది నియోజకవర్గాలతోపాటు పార్లమెంటు నియోజకవర్గాన్ని వైసీపీ(YCP) గెలుచుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 14 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్(Congress) ఏడు సార్లు, టిడిపి(TDP) మూడు సార్లు, వైసిపి ఒక సారి, స్వ‌తంత్రులు రెండు సార్లు, సిబిఐ(CBI) ఒక సారి గెలుపొందాయి. 2014 ఎన్ని క‌ల లెక్క‌ల ప్ర‌కారం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 186981 మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇక‌, 2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం గా 156936 ఓట్లు పోలయ్యాయి. అందులో మ‌హిళా ఓట‌ర్లు 79891 ఉండ‌గా, పురుష ఓట‌ర్లు 77038 మంది ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం లో 83.93 శాతం పోలింగ్ న‌మోదైంది.

ఇక అసలు విషయానికి వస్తే కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి జగన్ మేనమామ పి. రవీంద్రనాధ్ రెడ్డి(Ravindhranath Reddy) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి రాజకీయంగా ఎంత ఘన చరిత్ర ఉందో.. అంతే సెంటిమెంట్ కూడా మడిపడి ఉంది. ఇక్కడి నుంచి రెండుస్లారు గెలిచిన వ్యక్తి..మూడోసారి ఓడిపోతారనే వాదన స్థానికంగా బలంగా ఉంది. గతంలోనూ ఇదే జరిగింది. దీంతో భవిష్యత్తులోనూ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో జగన్ మేనమామ ఎమ్మెల్యే పి.రవీంద్రానాథ్‎రెడ్డి.. మరోసారి పోటీ చేస్తారా లేదా అని అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. 2014, 2019లో కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అనుకుంటున్నా.. ఈ సారి నియోజకవర్గానికి ఉన్న సెంటిమెంట్ కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. రవీంద్రనాధ్‎రెడ్డిలోనూ మూడోసారి సెంటిమెంట్‌ భయం మొదలైందనే చర్చ నడుస్తోంది. అందుకే, ఈ సారి తన కొడుకు రామాంజులరెడ్డిని(Ramanjula Reddy) రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారనేది మరో ప్రచారం.

ప్రస్తుతం చింతకొమ్మదిన్నె నుంచి జెడ్పీటీసీగా ఉన్న రామాంజులరెడ్డి రాజకీయ రంగప్రవేశం కూడా సెంటింట్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. రవీంద్ర నాధ్ రెడ్డి మొదటిసారి గెలిచిన చింతకోమ్మదిన్నె నుంచే జెడ్పీటీసీగా ఉన్నారు ఆయన కుమారుడు. శాసన సభ్యుడిగా కూడా కమలాపురం నుంచి పోటీ చేయిస్తే సెంటిమెంట్ వర్కవుట్‌ అవుతుందనే ఉద్దేశంతో రవీంద్రనాథ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవి తన కుటుంబం నుంచి చేజారకుండా ఉంటుందని భావిస్తున్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. కమలాపురంలో తన కొడుకును బరిలోకి దింపి.. తాను కడప నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. మూడోదఫా గండాన్ని ఇలా గట్టెక్కితే… మంత్రి పదవికూడా దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఉన్నారట రవీంద్రనాధ్ రెడ్డి. ఒకవేళ సీఎం జగన్‌.. రవీంద్రనాధ్ రెడ్డిని కమలాపురం నుంచే పోటీ చేయాలని ఆదేశిస్తే మాత్రం… సెంటింట్‌ను అధిగమించి గెలుస్తారా? అనేదే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు, వల్లూరు, పెండ్లిమర్రి మండలాల్లోని వైసీపీ నాయకులకు, సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మధ్య అసలు పొసగడం లేదని కేడర్‎లో చర్చ నడుస్తోంది. ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున్ రెడ్డి(Malikarjun Reddy), రవీంద్రనాథ్ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యతిరేకులంతా ఏకమై ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. అసలే అసమ్మతి సెగతో ఉక్కపోతకు గురవుతున్న రవీంద్రనాథ్ రెడ్డికి..కో కాంట్రాక్టర్ ప్రతాప్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో మరింత ఇరకాటంలోపడినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న హైకమాండ్ ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కమలాపురంలో పార్టీ గెలవాలంటే అభ్యర్థి మార్పు తప్పనిసరి అని పార్టీ కేడర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి పేరు గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో జమ్మలమడుగు ఇంచార్జీగా పని చేసి, ఎమ్మెల్యే సుధీర్‎రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా దుష్యంత్ రెడ్డి పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. దుష్యంత్‎రెడ్డి జగన్‎కు దగ్గరి బంధువు కావడం, జిల్లాలో పార్టీ విజయానికి కృషి చేసిన అనుభం ఉన్న నేపథ్యంలో పార్టీ అధినేత జగన్ దుష్యంత్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. స్వతహాగా బలగం, బంధువర్గం అధికంగా ఉన్న దుష్యంత్ రెడ్డి, సీఎం సతీమణి భారతికి(Bharathi) కూడా బంధువు కావడం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు జగన్‎తో ఉన్న సాన్నిహిత్యంతో దుష్యంత్ రెడ్డి(Dhushyanth Reddy) జగన్ కోటరీలో కీలక వ్యక్తిగా పేరుంది. కమలాపురం నియోజకవర్గంలోని వీరప్పనాయుడి మండలం తాటిమాకులపల్లె దుష్యంత్ స్వగ్రామం.

మరోవైపు కమలాపురం అభ్యర్థి మార్పుపై పార్టీ అధినేత జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని మార్చడం కష్టమే అయినప్పటికీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా.. కొత్త అభ్యర్థివైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి అని, పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వైనాట్ 175 అన్న పట్టుదలతో ఉన్న పార్టీ అధినేత, సీఎం జగన్ ఇప్పుడు ఏ మాత్రం రిస్క్ చేసే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు హైకమాండ్ ఆదేశించడమే తర్వాయి..పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు దుష్యంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్న టాక్ కమలాపురం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది

Updated On 19 Oct 2023 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story