Palakollu Constituency : నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో గెలుస్తారా..?
చైతన్య సిరి..క్షీరపురి పాలకొల్లు. పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం(Palakollu Constituency) రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు. ఒకప్పుడు కాంగ్రెస్(Congress) పార్టీకి కంచుకోటైన పాలకొల్లులో ఇప్పటికీ వైసీపీ బోణీకొట్టలేకపోయింది
చైతన్య సిరి..క్షీరపురి పాలకొల్లు. పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం(Palakollu Constituency) రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు. ఒకప్పుడు కాంగ్రెస్(Congress) పార్టీకి కంచుకోటైన పాలకొల్లులో ఇప్పటికీ వైసీపీ బోణీకొట్టలేకపోయింది. ఈసారి పాలకొల్లులో జెండా పాతాలనే ఆలోచనలో వైసీపీ(YCP) ఉంది. కాపుల ఖిల్లాగా చెప్పే పాలకొల్లులో ఈ సారి పోటీ ఎలా ఉండబోతోంది? మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచేదెవరు? టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు(nimmala ramanaidu) జోరుకు బ్రేక్ వేసే దమ్మున్న లీడర్ ఎవరు?
పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలకొల్లు. బ్రిటిష్ కాలంలోనే వ్యాపార కేంద్రంగా విరాజిల్లింది. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందింది. పారిశ్రామికంగానూ ప్రగతి సాధించింది. రైస్‌మిల్లులకు ప్రసిద్ధి. కొబ్బరి, నిమ్మ, తమలపాకు ఉత్పత్తులు నిత్యం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. పాలకొల్లు నియోజకవర్గం 180 చదరపుకిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తూర్పున వశిష్టగోదావరి, పడమరన భీమవరం, ఉత్తరాన ఆచంట, దక్షిణాన నరసాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకొల్లు మున్సిపాలిటీలో 31వార్డులు, యలమంచిలి మండలంలో 32 గ్రామాలు, పాలకొల్లు మండలంలో 27 గ్రామాలు, పోడూరు మండలంలో 8 గ్రామాలు కలిపి 67 గ్రామాలతో నియోజకవర్గం విస్తరించింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1, 80, 965 మంది ఓటర్లు ఉన్నారు. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాలకొల్లు పట్టణ నడిబొడ్డున డంపింగ్‌యార్డులు(Dumping Yard) ఉండటం,
పట్టణంలోని దమ్మయ్యపత్తి డ్రెయిన్(Dammayyapati drain) నిర్మాణం పనులు జరగకపోవడం, గ్రామాల్లో తాగునీటి సమస్య(Water Supply),
డ్రెయినేజీ సమస్యలతో(Drainage Problem) సతమతమవుతున్నారు.
పాలకొల్లు పట్టణం 11 శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఉండేది. ఈ సమయంలోనే క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం, గాలిగోపురం నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. పంచారామ క్షేత్రాల్లో క్షీరారామం శిరోభాగంగా విరాజిల్లుతోంది. అలాగే శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం, నరసాపురం రోడ్డులోని శ్రీ షిర్డి సాయి మందిరంతోపాటు, వాయుత్రిలింగ క్షేత్రాలుగా శివదేవునిచిక్కాల, దిగమర్రులోని శివాలయాలు ప్రసిద్ధిచెందాయి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. మరోవైపు ఈ ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. ఆ నాటి అత్యం సూర్యం, పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గర నుంచి పద్మశ్రీ అల్లు రామలింగయ్య, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎస్‌ఎస్ రవిచంద్ర, బందెల భాస్కరరావుతోపాటు అనేక మందిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత పాలకొల్లుకు దక్కింది. సినీ రంగంలోని అన్ని విభాగాల్లోనూ పాలకొల్లు మార్కు ఉంటుంది. పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వరస్వామి ఇక్కడ కొలువు కావడంతో ఆ నటరాజస్వామి ఆశీస్సులతో ఇంతమంది కళాకారులు ఉద్భవించారని ప్రతీతి.
పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు(Elections) జరిగాయి. 2004 వరకు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల మధ్యే ప్రధాన పోరు జరిగింది. 2004లో టీడీపీ(TDP) అభ్యర్థి సీహెచ్ సత్యనారాయణ మూర్తి(CH Satyanarayana Murthy) గెలిచారు. 2009లో కాంగ్రెస్‌పార్టీ(Congress) అభ్యర్థి బంగారు ఉషారాణి(Bangaru Usharani) ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిపై(Chiranjeevi) అనూహ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడి నుంచి రామానాయుడు గెలుపొందారు. ఇక్కడ నుంచి వరుసగా.. టీడీపీ విజయం దక్కించుకుంటోంది. 2019 జగన్ సునామీలోనూ.. నిమ్మల రామానాయుడు(Nimala Ramanayudu) విజయం సాధించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల సమస్యలను పట్టించుకొని, ప్రజలకు చేరువ అవుతున్నారు. వారికి ఆర్థికంగా ఇతరత్రా కూడా అండగా నిలుస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
జిల్లాలో కాపు సామాజిక వర్గానికి కేరాఫ్ అడ్రస్ గా పాలకొల్లు నిలుస్తోంది. ఈ నియోజవర్గంలో పార్టీ ప్రభావం కంటే అభ్యర్థుల బలాబాలాలే ఎక్కువగా గెలుపును నిర్దేశిస్తున్నాయి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రామానాయుడు.. వ్యక్తిగతంగా కష్టించి పనిచేయడంతోనే 2019లో వైసీపీ హవాలోనూ గెలవగలిగారని చెబుతుంటారు. 2024లో కూడా మళ్లీ గెలుస్తామని ధీమా ప్రదర్శిస్తోంది టీడీపీ. నియోజవర్గంలో గతంలో చేసిన అభివృద్ధే తనకు శ్రీరామ రక్ష అంటున్నారు ఎమ్మెల్యే రామానాయుడు. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు అంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కంట్లో నలుసులా మారిన రామానాయుడిని కట్టడి చేయాలని వైసీపీ కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత రెండుసార్లు తమకు అందని విజయాన్ని..ఈ సారి రామానాయుడిని ఓడించడం ద్వారా అందుకోవాలని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.
పాలకొల్లు నియోజవర్గంలో వైసీపీకి గట్టి క్యాడర్ ఉంది. టికెట్ ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చాలా మంది నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నా.. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాస్ జోరుగా తిరుగుతున్నారు. నియోజవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శ్రీనివాస్ జడ్పీ చైర్మన్‌గాను పనిచేశారు. దీంతో ఈ సారి పార్టీ తమకు అవకాశం ఇస్తుందని సీనియర్ నేతలు గుణ్ణం నాగబాబు(Naga Babu), మేకా శేషుబాబు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ, కార్యకర్తల్లో తనకే పట్టు ఉందని.. రామానాయుడిని ఓడించేదీ తానేనని ప్రతిజ్ఞ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాస్(MLC Kavuru Srinivas). పాలకొల్లులో నిమ్మల స్పీడ్ కు బ్రేక్ లు వేయాలన్న వైసీపీ వ్యూహం ఏ మాత్రం ఫలించడం లేదు. అభ్యర్థుల్ని మార్చినా..వైసీపీ అదృష్టం మారటం లేదా? 2014లో మేక శేషుబాబును బరిలోకి దింపితే ఓటమే ఎదురైంది. ఆ తర్వాత గుండం నాగబాబుని ఇక్కడ పార్టీ ఇంచార్జీగా నియమించింది. 2019 ఎన్నికల్లో నిమ్మలకు చెక్ పెట్టాలని గుండం నాగబాబుని తప్పించి టీడీపి నుంచి వచ్చిన సత్యనారాయణమూర్తిని పోటీలో పెట్టింది వైసీపీ. అయినా అపజయం తప్పలేదు. ప్రస్తుతం కౌరు శ్రీనివాస్ తోపాటు మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు పాలకొల్లు నేతల్లోని అసమ్మతి కూడా ఫ్యాన్ పార్టీని వెంటాడుతోంది. మరోవైపు 80 శాతం పూర్తి అయిన అభివృద్ది పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపిస్తుండగా.. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఈసారి పాలుకొల్లులో గట్టెక్కిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అటు జనసేన(Janasena) కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తానంటోంది. ఈ నియోజకవర్గంలో కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మరోవైపు జనసేనాని పవన్‌కు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. ఐతే గత ఎన్నికల్లో మాత్రం మూడోస్థానంతోనే సరిపెట్టుకుంది జనసేన. టీడీపీతో పొత్తు ఉంటే.. జనసేన ఓట్లు అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గానికి జనసేన ఇన్‌చార్జి ఎవరూ లేకపోయినా.. క్యాడర్ బలం మాత్రం చెక్కుచెదరలేదు. సరైన నాయకుడు వస్తే పాలకొల్లులో జనసేన జెండా ఎగరేస్తామంటున్నారు జనసైనికులు.
ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు స్థానం అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగానే మారింది. లక్ష 90 వేల 125 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రామానాయుడు 18 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బలమైన కాపునేతగా ఉన్న రామానాయుడు మరోసారి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ, జనసేన కూడా కాపు నేతలనే బరిలోకి దించే అవకాశం ఉంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లే విజేతలను నిర్ణయించనున్నాయి. ఇంతకీ పాల్లకొల్లులో ఈసారి పాగా వేసేదెవరు? బలమైన నాయకత్వంలేక సతమతమవుతున్న వైసీపీ.., నిమ్మల రామానాయుడి హాట్రిక్ ఛాన్స్ కు గండికొట్టాలన్న వ్యూహం ఫలిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.