రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) గుడ్‌న్యూస్ చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) గుడ్‌న్యూస్ చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను(Garbage tax) రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడా చెత్తపన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారు. బానిసత్వం వద్దు.. స్వాతంత్ర్యమే ముద్దు అని నినదించారు. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్‌కు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దీనికి అందరం ఆయనకు అభినందనలు చెప్పాలి. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనికి నేను ఛైర్మన్‌గా ఉన్నాను. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 2లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చాం. రాష్ట్రంలో 2019లో వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. రోడ్లపై 85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. సంవత్సరం లోపు చెత్త మొత్తం శుభ్రం చేయించాలని పురపాలక మంత్రి నారాయణను ఆదేశించాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశే ధ్యేయంగా ముందుకెళ్లాలి. 2029 నాటికి ఈ లక్ష్యానికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదు. ప్రజల ఆరోగ్యం బాగుందంటే దానికి కారణం స్వచ్ఛ సేవకులే. కొందరు స్వార్థ పరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారు. ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద వైద్యకళాశాల ఏర్పాటు చేస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.