సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఈలలు వేశారు

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసనలను తెలియజేశారు. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఈలలు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కూడా టీడీపీ సభ్యులు ఈలలు వేసుకుంటూనే బయటకు వెళ్లారు.

Updated On 6 Feb 2024 12:41 AM GMT
Yagnik

Yagnik

Next Story