Sirimanotsavam : రేపు సిరిమానోత్సవం .. ముస్తాబైన విజయనగరం
ఆంధ్రప్రదేశ్‌లోని(andhra Pradesh) విజయనగరం(Vijayanagaram) సిరిమానోత్సవానికి(siri mahostavam) సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని(andhra Pradesh) విజయనగరం(Vijayanagaram) సిరిమానోత్సవానికి(siri mahostavam) సిద్ధమవుతోంది. ఇవాళ జరిగే తొలేళ్ల ఉత్సవం కోసం ఉత్సాహపడుతోంది. పైడితల్లి ఉత్సవం(Paidithalli usthavam) అంటే మామూలుగా ఉండదు. దసరా(Dasara) తర్వాత వచ్చే సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ఇవాళ తొలేళ్ల ఉత్సవం, రేపు అనగా 15వ తేదీన సిరిమానోత్సవం జరగనుంది. ఉత్తరాంధ్రుల కల్పవల్లి, గజపతుల ఆడపడుచు, వాత్సల్య తరంగిణి, అమృత వర్సిణి, సకల కల్యాణ గుణరూపిణి శ్రీపైడితల్లి అమ్మవారు. బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి, దాన్ని నిలువరించడానికి చివరివరకు ప్రయత్నించి, అన్న మరణంతో తనువు చాలించి, సమాజ హితమే తన అభిమతం అని ప్రబోధించిన పుణ్యమూర్తి పైడిమాంబ. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొందిన ఆ తల్లి చరితం ఆదర్శనీయం. అన్ని వర్గాలవారికి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
సిరిమాను తయారీకి చింత చెట్టునే(tamarind tree) ఉపయోగిస్తారు. అర్చకుడు ఆ సిరిమానుకు ప్రత్యేక పూజలు చేసి పట్టణానికి చేరుస్తారు. వనం గుడిలోని అమ్మకు దాన్ని చూపించి హుకుంపేట చేర్చి నిపుణుల సమక్షంలో అమ్మవారి ప్రతిరూపమైన సిరిమానుగా తీర్చిదిద్దుతారు. ఉత్సవ సమయంలో 50 అడుగుల ఈ సిరిమాను చివర ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి, దానిలో అమ్మవారి ప్రతినిధిగా పూజారిని కూర్చోబెట్టి నగరంలో ఊరేగిస్తారు. అరటిపళ్లను పూజారిపైకి విసురుతూ మొక్కులు తీర్చుకొనే ఆనవాయితీ అక్కడ కనిపిస్తుంది. చెదురు గుడి నుంచి బయలుదేరే సిరిమాను లక్షలాది భక్తజనుల జయజయ ధ్వానాల మధ్య విజయనగరం కోట వద్దకు చేరుతుంది. కోటకు మూడు సార్లు ప్రదక్షిణతో ఈ ఉత్సవం ముగుస్తుంది. దేవాలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు ఈ సందర్భంగా పూజారిని సత్కరిస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఉత్సవం ముగిసిన తర్వాత సిరిమానును చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు. దానిని రైతులు తీసుకుని వాటిని ఇంట్లో ఉంచుకుని పూజలు చేస్తారు. కొందరు తమ పొలంలో పూజించే చోట ఉంచుతారు. అలాగే విత్తనాలతో పాటు పొలంలో వీటిని విసురుతారు. ఇదంతా కూడా మంచి పంటలు పండుతాయనే నమ్మకంతో చేస్తారు. సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత వచ్చే వరుస మంగళవారాల్లో తెప్పోత్సవం, ఉయ్యాలకంబాల ఉత్సవం జరుగుతుంది. అక్కడితో ఈ ఏడాది అమ్మవారి నెల రోజుల ఉత్సవాలు ముగుస్తాయి...