AP Students Japan: జపాన్ సకురా సైన్స్ ఫెయిర్‌కు ఏపీ విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుతూ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుతూ ఉండడం విశేషం. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఏడుగురు విద్యార్థులు తమ సైన్స్ ప్రతిభతో ‘జపాన్ సకురా’ పోటీలకు ఎంపిక అయ్యారు. వీరిలో ముగ్గురు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు మే నెలలో జపాన్ వెళ్లనున్నారు. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్‌ఓలో ప్రసంగించారు. ఇప్పుడు జపాన్ సకురా సైన్స్ ఫెయిర్‌కు ఏపీ విద్యార్థులు వెళ్లారు. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్‌స్పైర్) పేరుతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇన్‌స్పైర్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేశారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. అలా పిల్లల్లోని టాలెంట్ బయటకు వస్తూ ఉంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పాఠశాలల దశ-దిశ పూర్తిగా మారిపోయింది. బడ్జెట్ లో చాలా వరకూ నాడు-నేడుకు కేటాయిస్తూ ఉన్నారు. పాఠశాల విద్యార్థులు టెక్ పరంగా కూడా చాలా నేర్చుకుంటూ ఉన్నారు. పలు పోటీలలో భాగమవుతూ ఉన్నారు.