AP Nominations: ఏపీలో నేటి నుండే నామినేషన్లు.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!!
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలోనూ, అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు వేయాలి.
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. నామినేషన్స్ ను ఏప్రిల్ 26 వరకు పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఏపీలో మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు.