AP Liquor Policy : తమ్ముళ్లూ.. మీకు న్యాయమా.. రూ.99కే క్వార్టర్ వద్దా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లిక్కర్ పాలసీ అంత కిక్కు ఇవ్వడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లిక్కర్ పాలసీ అంత కిక్కు ఇవ్వడం లేదు. నాలుగు రోజుల్లో ఏపీలో కొత్త షాపులను అలాట్ చేస్తారు. కొత్త షాపుల్లో రూ.99కే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 3736 షాపులకు టెండర్లు పిలిచారు. తెలంగాణ తరహాలో నాన్ రిఫండబుల్ డిపాజిట్లను ప్రవేశపెట్టింది. ఇందుకోసం దరఖాస్తుదారులు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల కాలానికి లిక్కర్ షాపులను కేటాయించేందుకు సిద్ధమైంది. కానీ ప్రస్తుతం దరఖాస్తులు వేసేందుకు వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. నాన్ రిఫండబుల్ ఫీజు ద్వారానే 2 వేల కోట్ల ఆదాయం రాబట్టాలనుకున్న ఏపీ ఎక్సైజ్ శాఖ ఆశలు నీరుగారుతున్నాయి. మద్యం షాపుల లైసెన్స్ దక్కించుకునేందుకు కొందరు ఆసక్తిని కనబరుస్తున్నారు. కొందరు సిండికేట్ అయ్యి దరఖాస్తులు చేస్తున్నారు. మరి కొన్ని షాపులకు ఎవరికి వచ్చినా కలిసి వ్యాపారం చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. గడువు సమయంలోపు ప్రభుత్వం ఊహించిన స్థాయిలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకుంటే మరింత గడువు పొడిగించే అవకాశాలు లేకపోలేదు. అయితే ప్రజలు మాత్రం కొత్త లిక్కర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దసరాకు కొత్త షాపులు ఓపెన్ అయితే రూ.99 లిక్కర్ అందుబాటులోకి రానుండడంతో మద్యంప్రియులు లొట్టలేసుకుంటున్నారు. 3736 మద్యం షాపుల ద్వారా ఏడాదికి రూ.5,500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.