AP Elections : క్రిమినల్ కేసులున్న అభ్యర్ధులు మూడుసార్లు అలా చేయాల్పిందే..!
అంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుల్లో ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
అంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుల్లో ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనునట్లు పేర్కొన్నారు. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓటు ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటరు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డులు చూపించవచ్చని వెల్లడించారు.
ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపారు.ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ.. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు.. మే 13న పోలింగ్.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్ధానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో తాజా ఓటర్ల సంఖ్య 4,09,37,352 కాగా.. ఇందులో సర్వీస్ ఓటర్లు సంఖ్య 67,393గా పేర్కొన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన 9,01,863 మంది ఓటర్లు వున్నారు. ఏపీలో జనవరి ఒకటి నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. తాజాగా 1,97,000 మంది పెరిగారని అన్నారు. శనివారం వరకు వచ్చిన 6ఏ దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు.
ఏపీలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 179 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్ల స్లిప్ కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఎపిక్ కార్డులు లేకపోతే పోలింగ్ రోజు 12 రకాల గుర్తింపు కార్డులు చూపించవచ్చన్నారు.
85 సంవత్సరాలు పైబడిన వారు, వికలాంగులకి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్ధులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను పేపర్, టీవీలలో మూడుసార్లు పబ్లిష్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
3.82 లక్షలు ఉద్యోగులను ఎన్నికల కోసం వినియోగిస్తామని.. ఏపీ ఎన్నికలకి 50 మంది జనరల్ అబ్జర్వర్స్ ఉంటారని వెల్లడించారు. ప్రతీ అసెంబ్లీకి మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఉంటాయని.. అనుమానిత ఖాతాలపై నిఘా ఉంటుందని వెల్లడించారు. నాన్ కమర్షియల్ ప్రాంతాలలో ల్యాండ్ అయ్యే హెలీకాప్టర్లని తనిఖీలు చేపడతామన్నారు. 50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు.
శనివారం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుల్లో ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో 48 గంటలలోపు పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి వచ్చే 24 గంటలలోపు అన్ని ఫొటోలు తీసేయాల్సి ఉంటుందన్నారు. కొత్త పనులకు పర్మిషన్ లేదు.. జరుగుతున్న పనులకు ఇబ్బంది లేదన్నారు. మంత్రులు సమీక్షలు చేయకూడదు. మంత్రులకు ప్రోటోకాల్ ఉండదు.. కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేయడానికి లేదన్నారు.