Amaravathi : అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో తొమ్మిది కొత్త నగరాలు
అమరావతి(Amaravathi) రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా తొమ్మిది కొత్త నగరాలు రానున్నాయని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
అమరావతి(Amaravathi) రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా తొమ్మిది కొత్త నగరాలు రానున్నాయని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. తొమ్మిది నగరాల్లో హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ కూడా ఉన్నాయని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, వచ్చే సోమవారం లేదా బుధవారం అమరావతిలో చెట్ల తొలగింపు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఆగిపోయిన అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును కూడా పునఃప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లపై మరో నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలు(Bridges) నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం కృష్ణా నదిపై రెండు బ్రిడ్జిలు ఉండగా, త్వరలో మరో వంతెన అందుబాటులోకి రానుందని.. కృష్ణా నదిపై మొత్తం ఏడు వంతెనలు ఉంటాయని నారాయణ తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డుతో(Speed acsess Roads) పాటు చెన్నై-కోల్‌కతా హైవే నుంచి అమరావతి రాజధానికి మరో రెండు రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు నారాయణ సూచించారు. సీడ్ క్యాపిటల్ నుంచి విజయవాడ-చెన్నై జాతీయ రహదారికి ఈ5, ఈ11, ఈ13, ఈ15 రోడ్లను అనుసంధానం చేసేందుకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(Capital Region Development Authority) అంగీకరించిందని వెల్లడించారు. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లతో సెంట్రల్ డివైడర్‌తో నిర్మించేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు కూడా మంత్రి తెలిపారు.