NEET Exam At 69 years : 69 ఏళ్ల వయసులో నీట్ ఎగ్జామ్ రాశారు!
చదువుకొనడానికి డబ్బులవసరం. చదువుకోవడానికి సంకల్పం అవసరం. ఆ 69 ఏళ్ల వృద్ధ యువకుడిని పేదలకు వైద్య సేవలందించాలన్న కోరిక కలిగింది. అది పట్టుదలగా మారింది.
చదువుకొనడానికి డబ్బులవసరం. చదువుకోవడానికి సంకల్పం అవసరం. ఆ 69 ఏళ్ల వృద్ధ యువకుడిని పేదలకు వైద్య సేవలందించాలన్న కోరిక కలిగింది. అది పట్టుదలగా మారింది. ఆ సంకల్పబలంతోనే విజయనగరం(Vijayanagram) కేంద్రీయ విద్యాలయంలో నిన్న నీట్ పరీక్ష రాశారు. సీటు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
ఆయన పేరు డి.కె.ఎ.ఎస్.ప్రసాద్(DKAS prasad). రిటైర్డ్ ప్రొఫెసర్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(EEE)లో పట్టభద్రులైన ప్రసాద్ తర్వాత ఎంబీఏ(MBA) కూడా చేశారు. అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. కరోనా టైమ్‌లో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు.
హోమియో వైద్యంపై కొంచెం అవగాహన ఉన్న ప్రసాద్ పదవీవిమరణ తర్వాత పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. హోమియో మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఆయనకు వైద్య వృత్తిపై ఆసక్తి ఉంది. కానీ డిగ్రీ లేదు.
ఎంబిబిఎస్ చదవకుండా వైద్య వృత్తి కొనసాగించడం భావ్యం కాదనుకున్నారు. వెంటనే నీట్‌కు అప్లై చేశారు. అదేమిటి 69 ఏళ్ల వయసువారు కూడా నీట్ రాయొచ్చా అన్న అనుమానం అక్కర్లేదు. ఇంతకు ముందు 21 సంవత్సరాల లోపు వారు మాత్రమే నీట్ పరీక్ష రాయడానికి అనుమతి ఉండేది.
ఇప్పుడా రూల్ మార్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నీట్ అర్హత కోసం ఏజ్ లిమిట్‌ను తొలగించింది. ఎవరైనా ఎప్పుడైనా ఎగ్జామ్ రాయొచ్చు. ఆ విధంగా ప్రసాద్ కూడా ఆదివారం ఎగ్జామ్ రాశారు. ర్యాంకు వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు.