Chandrababu : ఎన్టీఆర్‌కు జరిగిన నయవంచనకు, వెన్నుపోటుకు 30 ఏళ్లు!
నారా చంద్రబాబు నాయుడు(chandrababu) మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి ఇవాళ్టికి 29 ఏళ్లు పూర్తయ్యాయి.
నారా చంద్రబాబు నాయుడు(chandrababu) మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి ఇవాళ్టికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. 30వ ఏడాదిలో చంద్రబాబు అడుగుపెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంతో పాటుగా తెలుగుదేశం పార్(TDP)టీ వ్యవస్థాపకుడు, అశేష ప్రజల అభిమానాన్ని చూరగొన్న నందమూరి తారక రామారావుకు ద్రోహం జరిగిన రోజు! నిజానికి ఈ రోజును అలాగే పరిగణించాలి. ఎన్టీఆర్‌ను గద్దె దింపిన రోజు ఇది కాకపోయినా ఎన్టీఆర్ ప్లేస్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు ఇది! చిత్రమేమిటంటే చంద్రబాబు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారన్న విషయం ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు,. తెలిస్తే బాగోదన్న ఉద్దేశంతోనే టీడీపీ అనుకూల మీడియా చాలా జాగ్రత్తలు తీసుకుంది. పిల్లనిచ్చి, రాజకీయ భవిష్యత్‌ను ఇచ్చి, పార్టీలో చేర్చుకోవద్దని హితులు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి అల్లుడనే మమకారంలో పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్(NTR) వెన్నులో చంద్రబాబు ఒక్క పోటు పొడిచారు. ఆయనను పదవీచ్యుడిని చేసి ఆయన స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1994 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశంపార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లక్ష్మీపార్వతిని(Lakshmi parathi) రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్‌ను ప్రజలు ఆదరించరేమోనని కొందరు అనుకున్నారు. టీడీపీలోని వారికి కూడా ఆ భయం ఉండింది. కానీ ప్రజలు మాత్రం వృద్ధాప్యంలో ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవడం వెనుక దారి తీసిన పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఎన్టీఆర్‌కు జై కొట్టారు. కానీ ఎన్టీఆర్ పాలనఎనిమిది నెలలైనా గడవలేదు.. లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టారు చంద్రబాబు. ఇందుకు చంద్రబాబుకు వత్తాసు పలికిన మీడియా అండగా నిలిచింది. చంద్రబాబు వెంట పట్టుమని పాతిక మంది ఎమ్మెల్యేలు లేకపోయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం వందకు పైగా ఎమ్మెల్యేలు చంద్రబాబు వెంట ఉన్నారని రాశాయి. అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా ఈ స్థాయిలో లేదు కాబట్టి ఆ పత్రికలు ఏం రాసినా చెల్లుబాటు అయ్యింది. లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా నడుచుకుంటున్నారని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని చంద్రబాబునాయుడు ఓ పథకం ప్రకారం తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారు. వెగటు పుట్టించే కార్టూన్లు వేయించారు. ఎన్టీఆర్ పట్ల నీచాతినీచంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని(Hyderabad) వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబు క్యాంప్ రాజకీయానికి తెరలేపారు. వైస్రాయ్ హోటల్ దగ్గరకు వెళ్లిన ఎన్టీఆర్, ఆయన వెంట ఉన్న కొందరు ఎమ్మెల్యేలపై చెప్పులు, రాళ్లు చంద్రబాబు వేయించారు. ఈ సంఘటనను పక్కదోవపట్టించడానికి చంద్రబాబు అనుకూల మీడియా ఎన్ని తిప్పలు పడినా అప్పుడా సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఎన్టీఆర్‌కు జరిగిన పరాభవాన్ని చూసి తల్లడిల్లారు. తట్టుకోలేకపోయారు. మొత్తం మీద చంద్రబాబు వ్యూహం ఫలించింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబు ఇలా చేస్తారని ఎన్టీఆర్ ఊహించి ఉండరు. అందుకే బాగా డీలా పడిపోయారు. చంద్రబాబును దశమగ్రహంగా, ఔరంగజేబుగా తిట్టిపోశారు. కేవలం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ఎన్టీఆర్ ఒక వీడియోను ఆ కాలంలోనే విడుదల చేశారు. దారుణమైన మోసానికి గురయ్యాననే బాధతోనే,కుటుంబ సభ్యులే దగా చేశారన్న ఆవేదనతోనే ఎన్టీఆర్ కన్నుమూశారు. అప్పటి నుంచి చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అప్పుడు చంద్రబాబు కుట్రలో భాగం పంచుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, బావమరది నందమూరి హరికృష్ణకు చంద్రబాబు నైజం ఏమిటో తెలిసివచ్చింది. తాము కూడా చంద్రబాబు చేతిలో మోసపోయామనే జ్ఞానోదయం కలిగింది. ఆ పాప కార్యక్రమంలో భాగస్వాములమయ్యామేనని వారు కూడా కలత చెందారు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. చంద్రబాబు ద్రోహ రాజకీయంపై దగ్గుబాటి రాసిన పుస్తకం చదివితే అప్పుడు జరిగిందేమిటో తెలుస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకంటే ఎన్టీఆర్‌కు ద్రోహం జరిగిన రోజుగానే పరిగణించాల్సి వస్తుంది.