విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ప‌న్నెండు మంది మృతి చెందగా.. 32 మంది గాయ‌ప‌డ్డారు.

విజయనగరం(Vijayanagaram) జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ప‌న్నెండు మంది మృతి చెందగా.. 32 మంది గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం, విశాఖ‌ప‌ట్నం(Visakhapatnam) ఆసుపత్రుల‌కు తరలించారు. రైల్వే అధికారులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస(Palasa) వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌(Signal) కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. దీంతో 3 బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్ర‌మాదంపై స‌మాచారం అందిన వెంట‌నే ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు

రైలు ప్రమాద ఘ‌టన నేపథ్యంలో అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

రైలు ప్రమాద దుర్ఘటనపై సీఎం జగన్‌(CM Jagan) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

Updated On 29 Oct 2023 7:31 PM GMT
Yagnik

Yagnik

Next Story