Swarupanandendra Saraswati : తెలుగు రాష్ట్రాలలో స్వాముల హడావుడి కనుమరుగు! సైలెంటైన స్వరూపానందేంద్ర సరస్వతి
Swarupanandendra Saraswati : తెలుగు రాష్ట్రాలలో స్వాముల హడావుడి కనుమరుగు! సైలెంటైన స్వరూపానందేంద్ర సరస్వతి
స్వాములకు రాజకీయలెందుకు? అరిషడ్వర్గాలను జయించిన వారికి రాజకీయాల పట్ల మోహం ఎందుకు? మత్సరమెందుకు? క్రోధమెందుకు? తెలుగు రాష్ట్రాలలోని కొందరు స్వాములను చూస్తుంటే సాధారణ ప్రజలకు వచ్చే సందేహాలివి! తుచ్చమైన రాజకీయాల్లోకి చేరడమెందుకు? నలుగురితో నానా మాటలు అనిపించుకోవడం ఎందుకు? ప్రజల్లో చులకన కావడం ఎందుకు? విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి(Swarupanandendra saraswti) భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించడానికి కారణం ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అనుకూలురు అన్న అనుమానం కలగడమే కదా! వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం స్వామి అలాగే ప్రవర్తించారు కదా! ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ముఖ్యమంత్రి అవ్వగానే స్వరూపానందేంద్ర సరస్వతి హవా అమాంతం పెరిగింది.
రాజశ్యామల యాగం చేసి జగన్‌ను అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఆయన పాపులరయ్యారు. ఆ మాటకొస్తే తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులే! అయిదేళ్ల కిందట ఇటు ఏపీలో, అటు తెలంగాణలో ఎన్నికల ముదు రాజశ్యామల యగాలు నిర్వహించడం ద్వారా జగన్, కేసీఆర్‌లను(KCR) అధికారంలోకి తెచ్చారనే కీర్తిని స్వామి సంపాదించుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలోనూ, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వంలోనూ స్వరూపానందేంద్ర స్వామి మాటకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో లేదు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేదు. దాంతో స్వరూపానందేంద్ర సరస్వతిని రాజకీయనేతలు పట్టించుకోవడం మానేశారు. గత వారం ఆయన భద్రతను కూడా ప్రభుత్వం కుదించింది. వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరినీ ప్రభుత్వం తొలగించింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా భద్రతను ప్రభుత్వం తీసేసింది. గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వామీజీకి భద్రత నిమిత్తం 2+2 గన్‌మెన్, ఎస్కార్ట్ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం దగ్గర విధులు నిర్వహించేవారు.
స్వామీజీ బయటకు వస్తే ఎస్కార్ట్ వాహనం ద్వారా ట్రాఫిక్ నియంత్రించేవారు. నిరంతరం పహారా కోసం శారదాపీఠం ప్రవేశద్వారం వద్దే మూడు షిఫ్ట్‌లు కలిపి 15 మంది ఉండే వారు. ఇప్పుడా డాబు దర్పం కనుమరుగయ్యాయి. పైగా ఆయనపై ఆరోపణలు కూడా వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చంద్రబాబును మచ్చిక చేసుకోవడానికి స్వరూపనందేంద్ర ప్రయత్నించారు కానీ అవి ఫలించలేదు. ఇప్పుడు స్వామి రెంటికి చెడ్డ రేవడయ్యారు. కూటమితో చెలిమి ఇక సాధ్యపడదని తెలుసుకున్న స్వామి ప్రస్తుతానికి మౌనంగానే ఉంటున్నారు. పీఠంలో ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. మీడియాలో కూడా ఆయన కనిపించడం లేదు. స్వరూపానందేంద్ర సరస్వతిని సందర్శించుకునే వారు కూడా తగ్గారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న తత్వం ఇప్పుడు స్వామికి బోధపడి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత చినజీయర్ స్వామి ప్రభావం బాగా పెరిగింది. కేసీఆర్‌ను పూర్తిగా తన చెప్పు చేతల్లో పెట్టుకోగలిగారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణ తర్వాత చినజీయర్‌ను కేసీఆర్ దూరం పెట్టారు. తెలంగాణలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత చినజీయర్ ప్రాభవం తగ్గింది. చినజీయర్ కూడా ఇప్పుడు సైలెంటయ్యారు. వారానికి ఒక్కసారైనా టెలివిజన్‌లో కనిపించే చినజీయర్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కాషాయం కట్టుకున్న తర్వాత ఏమేమీ చేయకూడదో ఈ స్వామిలిద్దరు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.