TV9 Rajinikanth : రజనీకాంత్‌కు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో మరో పోస్టు!
టీవీ9 ఎడిటర్ రజనీకాంత్‌పై సోషల్ మీడియాలో బోల్డన్నీ కథనాలు వస్తున్నాయి.
టీవీ9 ఎడిటర్ రజనీకాంత్‌పై సోషల్ మీడియాలో బోల్డన్నీ కథనాలు వస్తున్నాయి.అతడి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడాన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీన్ని రజనీకాంతే స్వయంగా ఖండించారనుకోండి. ఇక ఇప్పుడు అతడికి మద్దతుగా ఓ కథనం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.. అదే ఈ కథనం..
ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక వ్యక్తి కొంతమందికి టార్గెట్ అయ్యాడు. అతను ఏ పొలిటీషియనో అయితే అది మ్యాటరే కాదు. ఆశ్యర్యంగా అతనో జర్నలిస్ట్(Journalist).. ఇవాళ దేశంలో టాప్ జర్నలిస్టుల జాబితాలో మొదటివరుసలో నిలిచే వ్యక్తి. అతనే రజినీకాంత్.. టీవీ9 అతని ఇంటి పేరు..రజినీకాంత్(Rajinikanth tv9) అంటే సూపర్ స్టార్ గుర్తొస్తాడు. యస్.. ఇక్కడ రజినీ కూడా సూపర్ స్టారే.. తను ఎంతగానో ఇష్టపడే... ప్రాణం పెట్టి పనిచేసే మీడియాలో సూపర్ స్టార్. ఇంతకీ ఆ కొంతమందికీ టార్గెట్ అయ్యేలా రజినీకాంత్ ఏంచేశాడు? పుట్టిన తెలుగు నేల నుంచి ఎదిగి దేశాన్ని ఏలుతున్న టీవీ9 నెట్వర్క్‌లో కీలక భూమిక తీసుకుని అత్యంత బాధ్యతాయుతమైన తన పని తను నిశ్శబ్దంగా చేసుకుంటూపోతున్నాడు. తన పనేంటో చాలా స్పష్టంగా తెలుసు కనుకనే చీకటి చాటు నుంచి బలమైన ప్రత్యర్ధులు తన మీద విసురుతున్న రాళ్లకు వెరవక.. ఆ రాళ్లతోనే ఒక మహా దుర్గాన్ని నిర్మించాడు. కొత్త యాజమాన్యం తనకు అప్పగించిన పని అంత సులువైనది కాదని తొలినాళ్లలోనే అతనికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఎంచుకున్న లక్ష్యాన్ని చకచకా చేరడం కోసం మెరుపు వేగంతో కదిలాడు. మెదడుకు పదును పెట్టాడు. కొత్త వ్యూహాలతో సరికొత్త వార్తా ప్రపంచాన్ని సాక్షాత్కరించుకున్నాడు. దానికోసం రాత్రింబవళ్లూ శ్రమించాడు. ఇరవై ఏళ్లుగా తెలుగు మీడియాను(Telugu media) ఏలుతూ మార్కెట్ లీడర్‌గా ఉన్న చానల్‌ను అలానే కలకాలం నిలపడానికి నిరంతర కఠోర సాధన తప్పదని తెలుసు. అందుకే నిర్దేశించుకున్న తన గమ్యాన్ని చేరుకోవడం కోసం తను పరిగెత్తాడు. మెరికల్లాంటి తన బృందాన్ని పరిగెత్తించాడు. పనిచేసేవాళ్లను ప్రోత్సహించాడు. పనిచేయనివారిని పక్కకునెట్టాడు. ఈ క్రమంలోనే అతనికి కొత్త శత్రువులు తయారయ్యారు. బయటికెళ్లి గుంపుగట్టి పదేపదే అదేపనిగా పిచ్చిరాతలు రాస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో రజినీకాంత్ హయాంలో టీవీ9 తెలుగు ఒక విశ్వసనీయ వార్తా ఛానల్‌గా నిలిచింది. ప్రపంచంలోని తెలుగువారిలో అత్యధికులు నిత్యం చూసే తెలుగు చానల్‌గా ఖండాంతరాల్లో ఖ్యాతిగాంచింది. ఆలిండియాలో సక్సెస్ ఫుల్ అండ్ రిలైబుల్ తెలుగు న్యూస్ చానల్‌గా అవతరించింది. పాలిటిక్స్‌లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే టీవీ9 ఫాలో అవ్వాలనేట్టుగా పాపులర్ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ తెలుగు టెలివిజన్ న్యూస్ మీడియాలోనే టీవీ9 తిరుగులేని స్థానానికి చేరుకుంది. ఈ ఐదేళ్లలో ఈ చానల్‌లో వచ్చిన మార్పులు అందరూ గమనించే ఉంటారు. ఎక్కడా ఏ సందర్భంలోనూ గాలి వార్తలు కనిపించకుండా.. గాసిపింగ్ కబుర్లు వినిపించకుండా నిర్దిష్టమైన ప్రామాణికాల్ని నిర్దేశించుకున్నాడు రజీనీకాంత్. అప్పటివరకూ టెలివిజన్ న్యూస్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫార్ములాగా నడిచిన 3C (క్రైమ్.. సినిమా.. సెలబ్రిటీస్) సూత్రాన్నివదిలిపెట్టి.. 2P ఫ్యాక్టర్ (పబ్లిక్ అండ్ పాలిటిక్స్)ను ప్రవేశపెట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ మీద పబ్లిక్ అవేర్‌నెస్ పెంచే ఒక సీరియస్ పొలిటికల్ న్యూస్ చానల్‌గా టీవీ9ను తీర్చిదిద్దాడు రజినీకాంత్. ఇదేమంత తేలికగా జరిగింది కాదు. సోషల్ మీడియా అవతరించి టెలివిజన్ న్యూస్ మీడియా ఉనికినే సవాల్ చేసే సమయంలో సంస్థ బాధ్యతలు తీసుకున్నాడు రజినీకాంత్. సోషల్ మీడియా బలం తెలిసిన ఈ జనరేషన్ మీడియా వ్యక్తిగా తనకు తాను తీర్చిదిద్దుకుంటూ రానున్నతరం ఆలోచనలకు తగ్గట్టుగా దీటుగా టీవీ9ను నిలిపేందుకు తగిన వ్యూహం సమకూర్చుకున్నాడు. మీడియా చరిత్రలో సంప్రదాయేతర ప్రసార వ్యూహాల ద్వారా సరికొత్త పద్ధతులకు ఆద్యుడయ్యాడు. జనంలో ఆవేశాలు, ఉద్వేగాలను రెచ్చగొట్టే వార్తా ప్రసారాల కంటే వారిని ఆలోచనపరులుగా మార్చే వార్తాంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆచరణాత్మకమైన అడుగులు వేశాడు. విశ్వసనీయ వార్తలే టీవీ9లో ప్రసారానికి ఆమోదనీయమనే ఆంక్షల్ని ప్రవేశపెట్టి చిత్తశుద్దితో అమలుచేస్తున్నాడు. మీడియారంగంలో ఇంతై మొదలై ఇంతింతై ఎంతో ఎదిగి పరిణతి చెందిన ఆలోచనలతో పనిలో కొన్ని పరిమితుల్ని విధించుకున్నాడు. విలువలు వదిలేదే లేదని తన అనుచరులకు నిరంతరం నిర్దేశిస్తూ వస్తూ వారిలో భవిష్యత్ పట్ల కొత్త ఆశలు ఆలోచనలు కల్పించాడు. వాట్సాప్ గ్రూపుల్లో(whatsapp group) నిత్య ప్రవాహంలా పంపింగ్ చేసే తిట్ల దండకాలు, శాపనార్ధాలు, వ్యక్తిత్వ హననాలు తట్టుకోలేక రజినీకాంత్ ఇక టీవీ9 నుంచి వైదొలుగుతాడని ప్రత్యర్ధులు ఊహిస్తున్న తరుణంలో ఎక్కడా అతను తన పట్టుదల, మొండితనం, ధైర్యం వదులుకోలేదు. ఈ విషపు రాతల్ని తట్టుకొని ప్రత్యర్థుల నుంచి తప్పించుకునే వేగాన్ని ఒడిసిపట్టాడు. నిండుకుండలా ఉండే మనిషి నిప్పులు కూడా కురిపించగలడని చాటడానికి సమాయత్తమవుతున్నాడు. ఆకాశానికి దట్టంగా పట్టిన మబ్బుల్ని వదిలించుకుంటూ తూర్పున సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. ఎక్కడా ఆగడు. అలసిపోడు..
ఇదీ రజనీకాంత్‌కు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వచ్చిన కథనం!