ACB Raids : ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌

ఏసీబీ ఆపరేషన్‌లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు.

Update: 2024-08-13 04:38 GMT

ఏసీబీ ఆపరేషన్‌లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల‌లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డి సంచలనం సృష్టించారు. సంజీవని వనం సమీపంలోని గుర్రంగూడ క్రాస్‌రోడ్డు వద్ద మదన్‌మోహన్‌రెడ్డి గుర్రంగూడ గ్రామానికి చెందిన జక్కిడి ముత్యంరెడ్డి నుంచి 8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఆపరేషన్‌ బయటపడింది. ధరణి పోర్టల్‌లో ఓ భూమి విష‌యం చ‌క్క‌బెట్టేందుకు లంచం డిమాండ్ చేసినట్లు స‌మాచారం.

మదన్ మోహన్ రెడ్డికి చెందిన మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారులో ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. మదన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించగా.. ఇందులో జాయింట్ కలెక్టర్ ఎం.వి. భూపాల్ రెడ్డి పాత్ర కూడా ఉన్న‌ట్లు వెల్ల‌డించాడు. సోమ‌వారం రాత్రి 10:41 గంటలకు జాయింట్ కలెక్టర్ ఎం.వి. భూపాల్‌రెడ్డి తన అధికారిక వాహనంలో పెద్దంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్దకు రాగా.. మదన్ మోహన్ రెడ్డి ప్లాస్టిక్ సంచిలో ఉంచిన‌ లంచం మొత్తాన్ని తీసుకెళ్లి ఇన్నోవా కారులో ఉన్న భూపాల్‌రెడ్డికి ఇచ్చాడు. ఆ స‌మ‌యంలో ఏసీబీ డబ్బును రికవరీ చేసింది. ఇద్దరు అధికారులు తమ పదవులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. ఇద్ద‌రు అధికారుల‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. విచారణ కొనసాగుతోంది.

Tags:    

Similar News