Drugs Case : రకుల్ సోదరుడు అమన్ గురించి పోలీసులు ఏమన్నారంటే..
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను కొకైన్ సేవించినందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) అరెస్టు చేసింది
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను కొకైన్ సేవించినందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) అరెస్టు చేసింది. అయితే పోలీసులు నటి రకుల్ పేరు చెప్పడానికి నిరాకరించారు. సైబరాబాద్ పోలీసులతో పాటు TGNAB అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌ను ఛేదించిన తర్వాత.. గుర్తించిన 13 మందిలో అమన్ కూడా ఉన్నాడు. ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురు డ్రగ్ డీలర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒక మహిళ. అలాగే 199 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు నైజీరియన్లు పరారీలో ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. వీరి గురించి సమాచారం ఇస్తే రూ.2 లక్షల రివార్డును ఇస్తామని TGNAB ప్రకటించింది.
డ్రగ్స్ తీసుకున్న వారిలో హైదరాబాద్‌కు చెందిన అమన్ ప్రీత్ సింగ్, కిషన్ రాఠి, అనికేత్ రెడ్డి, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్ ధావన్, మధుసూధన్, రఘు, కృష్ణంరాజు, వెంకట్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఐదుగురికి కొకైన్ పాజిటివ్‌గా తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టు ముందు హాజరు పరుస్తామని డీసీపీ తెలిపారు.
అమన్ ప్రీత్ సింగ్‌ను లోటస్ పాండ్ వాసిగా గుర్తించారు. అమన్ ఒక ప్రముఖ నటి సోదరుడా అని ఒక విలేఖరి అడగగా.. “ఈ దశలో అతడు ఎవరి సోదరుడనే దానిపై మేము వ్యాఖ్యానించలేము. తదుపరి విచారణలో మేము ఈ విషయం తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. ఐదుగురి శాంపిల్స్ తీసుకున్నామని.. అందులో అమన్ సింగ్ కు పాజిటీవ్ వచ్చిందన్నారు డీసీపీ శ్రీనివాస్. అమన్ సింగ్ ను వినయోగదారుడిగానే విచారిస్తున్నామని చెప్పారు.
పక్కా సమాచారం మేరకు.. సైబరాబాద్ కమిషనరేట్‌లోని నార్సింగి పోలీసులతో కలిసి టీజీఎన్‌ఏబీ సిబ్బంది హైదర్‌షాకోట్‌లోని విశాల్ నగర్‌లోని ఓ ఫ్లాట్‌పై దాడి చేసి ఐదుగురు డ్రగ్స్ డీలర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.36 లక్షల విలువ చేసే 199 గ్రాముల కొకైన్, రెండు పాస్‌పోర్టులు, రెండు బైక్‌లు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.