తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు..!

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు..!

By :  ehatv
Update: 2025-01-13 06:24 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడ కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి.. రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా మాత్రమే సంక్రాంతి శోభ ద్విగుణీకృతమవుతుంది. రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలనే దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థించిన కేసీఆర్. భోగీతో ప్రారంభమై, మకర సంక్రాంతి, కనుమతో మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ వ్యవసాయాధారిత పల్లె సంస్కృతిలో ప్రత్యేకతను చాటుకుంటుందని పేర్కొన్నారు. పండిన పంటల రాశులతో ఇండ్లు కళకళలాడుతుండగా, రైతు జీవితాల్లో సంక్రాంతి శోభ నిండుదనాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. రంగవల్లులతో, భోగి మంటలతో, గొబ్బెమ్మలతో, గంగిరెద్దుల ఆటలతో, పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ప్రకృతి పండుగ మకర సంక్రాంతి అని కేసీఆర్ పేర్కొన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు సంతోషంతో నిండాలని, నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించిందని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా నాడు అమలు చేసిన కార్యాచరణ పదేళ్ల అనతికాలంలో సత్ఫలితాలనిచ్చిందని వివరించారు. అందులో భాగంగా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు, రైతు కుటుంబాలకు భరోసాగా రైతు బీమా వంటి పథకాలను పటిష్టంగా అమలు చేశామని తెలిపారు. తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలు పొందిందని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. వ్యవసాయానికి దన్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కులవృత్తులకు గతంలో లేని విధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభ నింపిందని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగ అభివృద్ధికి ఖర్చు చేసిందని వివరించారు. రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢసంకల్పంతో ముందుకు సాగామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, బీఆర్‌ఎస్ హయాంలో పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా, రాజీపడకుండా పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. తద్వారా రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూర్చినవారమవుతామని అన్నారు. రైతన్నల జీవితాల్లో వెలుగులు కొనసాగాలంటూ ప్రకృతిమాతను ఈ సందర్భంగా ప్రార్థించారు.

Tags:    

Similar News