BJP MLA Payal Shankar : సీఎం వద్దనే హోంశాఖ ఉంది.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హిందువుల మీద కక్షసాధింపుగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హిందువుల మీద కక్షసాధింపుగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గోవులను వధించకూడదని కోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. మెదక్ లో వందలాది గోవులను వధించేందుకు తీసుకెళ్తుంటే గోరక్షకులు పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా కనీసం స్పందించలేదన్నారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని గోరక్షకులు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో వాహనాలను గోరక్షకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. నిందితులు గోరక్షకులపై దాడి చేశారు. అయినా పోలీసులు ఒక వర్గానికి కొమ్ముకాస్తు గోరక్షులను, హిందూ యువకులను దోషులుగా చిత్రీకరించి జైలుకు పంపారని.. చివరికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.
అక్రమంగా గోవులను తరలిస్తుండగా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించి తిరిగి హిందూ యువకులపై అక్రమంగా 307సెక్షన్ కింద కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో కూడా వేలమంది ఒక బస్తీ మీద దాడులు చేస్తే పోలీసులు తూతూ మంత్రంగా కేసులు బనాయించిన్రు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా నిర్మాల్ జిల్లా భైంసా పట్టణంలో కూడా 23 మంది ఆంజనేయస్వామి భక్తులపై అక్రమంగా సెక్షన్ 307 కేసులు పెట్టి వేధించారని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే హోంశాఖ ఉన్నది. మెజారిటీ ప్రజల మనోభావాలు, హక్కులు కాలరాస్తూ హిందూ యువకుల మీద కక్షగట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏరకంగా పరిపాలన చేయాలనుకుంటున్నది..? అని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులను అవమానపరిచి, హిందూ యువకుల మీద అక్రమ కేసులు పెడితే ఎలాంటి శిక్ష అనుభవించారో కాంగ్రెస్ నాయకులు గ్రహించాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని.. జరిగిన నాలుగు సంఘటనల మీద న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు లేవా..? హైకోర్టు చెప్పినా విచారణ జరపకుండా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం సబబు కాదన్నారు. గోరక్షకులు సమాచారం అందించినా కూడా పోలీసులు స్పందించకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉన్నదని చెప్తున్న రాష్ట్ర డీజీపీ జరిగిన సంఘటనల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మెజారిటీ ప్రజల మీద కేసులు పెడితేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ కంట్రోల్ లో ఉన్నట్టా డీజీపీ గారు.. 144 సెక్షన్లు, 307 సెక్షన్లు హిందువులకు మాత్రమే వర్తిస్తాయా..? అని ప్రశ్నించారు. జరిగిన సంఘటనల మీద రాష్ట్ర ప్రభుత్వమే చిత్తశుద్ధితో విచారణ చేయించాలి. విచారణ జరిపించకపోతే మిగతా కమిషన్లను కూడా ఆశ్రయిస్తామన్నారు. హిందువులపై జరిగిన దాడుల ఘటనలపై అసలు విషయాలు బయటకు తెలిసేంతవరకూ, అసలు నిందితులపై చర్యలు తీసుకునేవరకూ బీజేపీ పోరాటం ఆగదన్నారు.