Asaduddin Owaisi : ‘రాత్రి 11 గంటల తర్వాత లాఠీచార్జి’ పోలీసుల హెచ్చరికపై ఒవైసీ స్పందన
రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై కనిపిస్తే లాఠీచార్జి చేస్తామని హెచ్చరిస్తున్న హైదరాబాద్ పోలీసుల ప్రకటనపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై కనిపిస్తే లాఠీచార్జి చేస్తామని హెచ్చరిస్తున్న హైదరాబాద్ పోలీసుల ప్రకటనపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
పాతబస్తీ ప్రాంతంలో ఆటోరిక్షాకు అమర్చిన లౌడ్ స్పీకర్ ద్వారా చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై కనిపిస్తే లాఠీచార్జి చేస్తామని అనౌన్సర్ హెచ్చరిస్తున్నట్లు వీడియోలో ఉంది.
“రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై కనిపించవద్దు. కనపడితే లాఠీచార్జి చేస్తాం. నో ప్రెండ్లీ పోలీస్.. లాఠీచార్జి పోలీస్.. రాత్రి 11 గంటల తర్వాత దుకాణాలు కూడా తెరవవద్దు’’ అని అనౌన్సర్ చెప్పడం వినిపించింది.
నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ప్రకటన చేయగలరా అని అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించారు.
“అవి ఇరానీ చాయ్ హోటల్‌లు, పాన్ షాపులు, వాణిజ్య సంస్థలు అయినా వాటిని కనీసం 12 గంటల వరకూ తెరిచి ఉంచడానికి అనుమతించాలి. అంతటా ఏకరీతి విధానం ఉండాలి. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద మెట్రో నగరాలు రాత్రిపూట దుకాణాలను తెరవడానికి అనుమతిస్తాయి. ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఉంది. హైదరాబాద్‌లో ఎందుకు భిన్నంగా ఉంది? అని ప్రశ్నించారు.
ఇదిలావుంటే.. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధించారు. గత కొద్ది రోజులుగా వరుస హత్యలు జరుగుతుండటంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్థరాత్రి రోడ్లపై లక్ష్యం లేకుండా తిరగవద్దని ప్రజలకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటీవల శాంతిభద్రతలను సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరాలను అదుపు చేసేందుకు కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. నేరస్తులు, మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చే వారి సంచారాన్ని అరికట్టేందుకు పోలీసులు నగరంలో రాత్రిపూట పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. గత రెండు రోజులుగా అర్ధరాత్రి దాటిన తర్వాత వీధుల్లో తిరుగుతున్న యువకులను పోలీసులు చుట్టుముట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు.