Team India Returns : ఎట్టకేలకు టీ20 ప్ర‌పంచ క‌ప్‌తో భారత్‌కు చేరుకున్న రోహిత్ సేన‌

టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది.

By :  Eha Tv
Update: 2024-07-04 04:43 GMT

టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ సైన్యం, మీడియా ప్రతినిధులు స్వదేశానికి తిరిగి రావడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఎయిర్ ఇండియా విమానం AIC24WC (ఎయిరిండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్) ఈ ఉదయం భారతదేశానికి చేరుకుంది.

బెరిల్ తుపాను కారణంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు, దాని సహాయక సిబ్బంది, కొందరు బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబాలు బార్బడోస్‌లో చిక్కుకోవడం గమనార్హం. గ‌త శనివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి భార‌త్‌ టైటిల్ గెలుచుకుంది. దీని తరువాత రోహిత్ బృందం అక్కడే హోటల్‌లో ఉండిపోయింది.

ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత భారత జట్టు సాధారణ విమానంలో భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది, అయితే తుఫాను కారణంగా బార్బడోస్‌లో కర్ఫ్యూ పరిస్థితులు ఉన్నాయి. అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. ఆటగాళ్లు, సిబ్బంది వారి వారి హోటళ్లలో చిక్కుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని బార్బడోస్‌కు పంపింది.

భారత జట్టుకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయం వెలుపల అభిమానులు గుమిగూడారు. రోహిత్ శర్మ సైన్యానికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. 17 ఏళ్ల వారి నిరీక్షణ నేటితో ముగిసింది. అంతకుముందు 2007లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. భారత జట్టు ఉద‌యం 6 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు. దీని తర్వాత రోహిత్ శర్మ బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరుతుంది. వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ప్రకటించిన 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని భారత జట్టుకు అందజేయ‌బ‌డుతుంద‌ని చెప్పాడు.

బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ.. భారత జట్టును వెనక్కి తీసుకురావడానికి బీసీసీఐ ప్రత్యేక ఎయిర్‌ ఇండియా విమానాన్ని పంపిందని.. అంతే కాకుండా చిక్కుకుపోయిన మీడియా ప్రతినిధులను కూడా అదే విమానంలో వెనక్కి తీసుకువస్తున్నామని.. రేపు ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని తెలిపారు. "ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి తన నివాసంలో రోహిత్‌ బృందానికి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం వారు ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరి అక్కడ నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు గౌరవార్థం రోడ్ షో నిర్వహిస్తారు. వాంఖడే స్టేడియంలో వారి కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయబడింది. అక్కడ భారత క్రికెట్ జట్టు, కోచ్‌లు. సహాయక సిబ్బందిని సత్కరిస్తారు. వారికి BCCI ప్రకటించిన 125 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారని వెల్ల‌డించారు. 

Tags:    

Similar News