Women’s T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే..!
త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ మంగళవారం జట్టును ప్రకటించింది
త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ మంగళవారం జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. స్మృతి మంధాన జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. మహిళా సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. ఈ తొమ్మిదో ఎడిషన్ టోర్నీ దుబాయ్, షార్జాలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంకలతో పాటు భారత్ గ్రూప్-ఎలో చోటు దక్కించుకుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ఆడనుంది. అక్టోబరు 6న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి.
ఈ జట్టులో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనింగ్ జోడీ షెఫాలీ వర్మ, స్మృతి మంధానలపై సెలక్టర్లు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. మిడిల్ ఆర్డర్ బాధ్యత కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా, దీప్తి, రిచాపై ఉంటుంది. మ్యాచ్ పినిషర్లుగా పూజ, శ్రేయాంకలు తమ బాధ్యత పోషించాల్సివుంటుంది. శ్రేయాంకను జట్టులోకి తీసుకున్నప్పటికీ టోర్నీకి ముందు ఆమె ఫిట్‌నెస్‌ను పరీక్షించనున్నారు. టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి శ్రేయాంక ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నారు. శ్రేయాంక స్పిన్ ఆల్ రౌండర్.. మ్యాచ్‌ని మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ప్లేయర్. హర్మన్‌ప్రీత్ కౌర్ నాలుగోసారి ఈ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆమె 2018, 2020, 2023 మహిళల T20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు కూడా నాయకత్వం వహించింది. అనుభవజ్ఞులైన దీప్తి, రాధ, ఆశా భుజాలపై స్పిన్ బాధ్యతలు ఉంచారు సెలక్టర్లు. యూఏఈలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికె), యాస్తికా భాటియా (వికె), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, డైలాన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజన సజీవన్. ట్రావెలింగ్ రిజర్వ్ : ఉమా ఛెత్రి (వాక్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ : రాఘవి బిష్త్, ప్రియా మిశ్రా
మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు చోటు దక్కించుకున్నాయి. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. టోర్నీకి ముందు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.