Tejashwi Yadav : 'విరాట్ కోహ్లీ' నా కెప్టెన్సీలో ఆడాడు.. ఆ విషయం ఎవరూ మాట్లాడరు..!
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ బీహార్ రాజకీయాలలో రాణిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ బీహార్ రాజకీయాలలో రాణిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. తన చదువు విషయంలో తేజస్విని పదే పదే ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతలో తేజస్వి యాదవ్‌ను క్రికెట్ విషయం గురించి అడిగారు. దానిపై తేజస్వి స్పందిస్తూ.. తన క్రికెట్ నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. భారత జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఆడాడని చెప్పాడు.
భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు తనతో కలిసి ఆడారని తేజస్వీ యాదవ్ చెప్పాడు. జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'నేను క్రికెటర్‌ని, దాని గురించి ఎవరూ మాట్లాడరు. విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు. దీని గురించి ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా.? ప్రొఫెషనల్‌గా నేను మంచి క్రికెట్ ఆడాను. టీమ్ ఇండియాలో చాలా మంది ఆటగాళ్లు నా బ్యాచ్‌మేట్స్. నా రెండు లిగ్‌మెంట్స్ ఫ్రాక్చర్ అవడం వల్ల నేను ఆటకు దూరం కావాల్సి వచ్చిందన్నారు.
34 ఏళ్ల తేజస్వి యాదవ్ క్రికెట్ కెరీర్‌లో.. ఒక పస్ట్ క్లాస్ మ్యాచ్, రెండు లిస్ట్ A, నాలుగు T20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు 2009లో జార్ఖండ్ తరఫున అరంగేట్రం చేశాడు. అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 పరుగులు, లిస్ట్ ఎలో 14 పరుగులు చేశాడు. టీ20 ఇన్నింగ్స్‌లో తేజస్వి 3 పరుగులు చేశాడు. బౌలింగ్ లో.. అతడు ఒక వికెట్ తీశాడు. అతడు IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్)కు కూడా ఎంపికయ్యాడు.
అయితే అంతకుముందు తేజస్వి, విరాట్ జూనియర్ క్రికెట్‌లో ఢిల్లీ తరపున చాలా మ్యాచ్‌లు ఆడారు. 2003లో జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన ఢిల్లీ అండర్-15 క్రికెట్ జట్టుకు విరాట్ కెప్టెన్సీలో తేజస్వి తన జూనియర్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2013లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తేజస్వి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. క్రికెట్ ఆడుతూనే 2010లో తన పార్టీ ఆర్జేడీకి ప్రచారం చేయడం ప్రారంభించాడు. 2015 ఎన్నికల్లో గెలిచి బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పొందారు.