ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆతిథ్య జట్టు పాక్‌ ఔట్..!

ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆతిథ్య జట్టు పాక్‌ ఔట్..!

By :  ehatv
Update: 2025-02-25 06:19 GMT

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆతిథ్య జట్టు పాక్‌ ఔట్‌ అయింది. అధికారికంగా భారత జట్టు సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సోమవారం బంగ్లాదేశ్‌ను న్యూజిలాండ్‌ ఓడించడంతో అటు పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది, ఇటు భారత జట్టు అధికారికంగా సెమీస్‌ దారి పట్టింది. లీగ్‌ దశ నుంచి పాక్‌ జట్టు నిష్క్రమించడం విశేషం. మూడు దశాబ్దాల తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీలో కేవలం ఆరు రోజుల్లోనే పాక్ జట్టు నిష్క్రమించింది. మరో విషయం ఏంటంటే డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండు జట్లతో జరిగిన మ్యాచులో ఓడిపోయింది. సోమవారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించడంతో పాకిస్థాన్.. నిష్క్రమణ ఖరారైంది.కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగాయి. అందులో గ్రూప్‌-ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు కూడా మిగతా మూడు మ్యాచ్‌లతో ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరతాయి. అయితే పాకిస్థాన్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయింది. ఆడిన రెండు మ్యాచుల్లో భారత్, కివీస్‌ గెలిచాయి. దీంతో ఈ రెండు జట్లు కూడా సెమీస్‌కు వెళ్లేందుకు అర్హత సాధించాయి. చివరి మ్యాచ్‌లో పాక్‌ గెలిచినా లాభం లేదు.. ఆ జట్టు ఖాతాలో ఒక విజయం, రెండు పాయింట్లు మాత్రమే చేరుతాయి.ఈ ఫలితంతో గ్రూప్‌-ఏ నుంచి టాప్‌-2 జట్లేవో ఖరారయ్యాయి. అయితే ఎవరు తొలిస్థానం, ఎవరు రెండోస్థానంలో ఉంటారనేది తేలాల్సి ఉంది. మార్చి 2న జరిగే భారత్‌-న్యూజిలాండ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచి.. లీగ్ దశను ముగిస్తుంది. 

Tags:    

Similar News