Vinesh Phogat : వినేష్ ఫోగట్ త‌ర‌పున పోరాడ‌టానికి రంగంలోకి దిగిన‌ టాప్ లాయ‌ర్‌..!

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ రెజ్లింగ్ మ్యాచ్‌కు ముందు అనర్హత వేటు పడిన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పతకంపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు

Update: 2024-08-09 03:56 GMT

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ రెజ్లింగ్ మ్యాచ్‌కు ముందు అనర్హత వేటు పడిన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పతకంపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. ప్రఖ్యాత భారతీయ న్యాయవాది హరీష్ సాల్వే ఒలింపిక్స్ నుండి వినేష్ అనర్హత కేసులో భారత ఒలింపిక్ సంఘం (IOA) తరపున వాదించ‌నున్నారు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో వినేష్ ఫోగట్ కేసుపై వాదించేందుకు IOA ఆయ‌న‌ను నియమించినట్లు ANI పేర్కొంది.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉంద‌న్న కార‌ణంతో వినేష్‌పై అనర్హత వేటు ప‌డింది. దీనిపై వినేష్ సీఏఎస్ లో కేసు వేశారు. ఈరోజు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు CASలో విచారణ ప్రారంభమవుతుంది.

గతంలో హరీశ్ సాల్వే పాక్‌లో ఖైదు చేయబడిన కులభూషణ్ జాదవ్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాడారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకునే సాల్వే.. అప్పట్లో ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఈ కేసులో పాకిస్థాన్ ఓటమిని చవిచూసింది. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు త‌ర్వాత‌ వినేష్ ఫోగట్ గురువారం రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.

అమ్మ నాపై కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయాను. నన్ను క్షమించు, మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. ఇప్పుడు నాకు పోరాడే బలం లేదు. గుడ్‌బై రెజ్లింగ్ 2001-2024. మీ మన్ననలకు నేను మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని ఎక్స్‌లో పోస్టు చేసింది.

తన నిర్ణయాన్ని పునఃపరిశీలించమని ఫోగట్‌ను కోరారు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్. ANIతో ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఫోగట్ ప్రకటన తొంద‌ర‌పాటులో చేసినట్లు అనిపిస్తోందని అన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె రిటైర్మెంట్ గురించి కుటుంబం, సమాఖ్య , ఇతర క్రీడా అధికారులతో చర్చించాలని సూచించారు.

Tags:    

Similar News