Mohammed Shami : సానియా మీర్జాతో పెళ్లి వార్త‌లు.. మౌనం వీడిన మహ్మద్ షమీ

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ షమీ, టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్తలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న విష‌యం తెలిసిందే

By :  Eha Tv
Update: 2024-07-20 05:59 GMT

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ షమీ, టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్తలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ పుకార్లపై ష‌మీ ఎట్టకేలకు స్పందించాడు. యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్ సందర్భంగా షమీ ఈ విషయాలను ఖండించాడు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై షమీ మండిపడ్డారు. ఇలాంటి మీమ్స్ వినోదాన్ని అందించగలవని.. కానీ చాల హానికరం అని అన్నాడు. 'సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని.. ఇలాంటి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయవద్దని నేను కోరుతున్నాను' అని అన్నాడు.

ష‌మీ మాట్లాడుతూ.. నేను ఒక్కటి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను.. మీమ్‌లు మీ సరదా కోసం చేస్తున్న‌వ‌ని నేను అంగీకరిస్తున్నాను. అయితే అవి ఎవరి జీవితానికి సంబంధించినవి కాకుడ‌దు. ఒక వేళ వేరే వాళ్ల‌వి అయితే.. మీమ్‌లను చాలా ఆలోచనాత్మకంగా రూపొందించాలి. మీమ్ చేసేవారిది ధృవీకరించబడిన(వెరిఫైడ్‌) అకౌంట్‌ కాదు.. వారి చిరునామా తెలియదు. వారి ఎవ‌రి గురించి చేస్తున్నారో వారి సమాచారం ఉండ‌దు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో మీరు ఎలా మీమ్స్ ఎలా చేస్తారు. మీకు ధైర్యం ఉంటే వెరిఫైడ్‌ పేజీ ద్వారా మీమ్స్ చేయండి. నీళ్ల‌లో నిలబడి వేరొకరి కాలు లాగడం చాలా సులభం. జీవితంలో విజయం సాధించి మీ స్థాయిని పెంచుకోండి. అప్పుడు మీరు మంచి వ్యక్తి అని నేను అంగీకరిస్తానని పుకార్ల‌పై గ‌ట్టి కౌంట‌రిచ్చాడు.

గత కొన్ని రోజులుగా మహమ్మద్ షమీ, సానియా మీర్జాల పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒకే మతానికి చెంద‌డం.. వారి మొద‌టి వివాహాలు ఫెయిల‌వ్వ‌డంతో కొంతమంది మీమ‌ర్స్ వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నాయి. ష‌మీ ఖండ‌న త‌ర్వాత అయినా వీటికి పుల్‌స్టాప్ ప‌డుతుందేమో చూడాలి మ‌రి.

Tags:    

Similar News