Weather Report : నేడు బంగ్లా వ‌ర్సెస్ టీమిండియా మ్యాచ్‌.. వ‌ర్షం ప‌ల‌క‌రిస్తుందా..?

అఫ్గానిస్థాన్‌తో సూపర్‌ఎయిట్ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన‌ భారత జట్టు శనివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది

By :  Eha Tv
Update: 2024-06-22 05:09 GMT

అఫ్గానిస్థాన్‌తో సూపర్‌ఎయిట్ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన‌ భారత జట్టు శనివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఆంటిగ్వా వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై విజయం నమోదు చేయడం ద్వారా సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలని జట్టు కోరుకుంటోంది. అంత‌కుముందు బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి విజయం సాధించింది.

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత్ టోర్నీని ప్రారంభించింది. ఆ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది. అనంత‌రం ఆతిథ్య అమెరికాను ఓడించి సూపర్ ఎయిట్ దశకు అర్హత సాధించింది. కెనడాతో భారత్‌ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వగా.. ఆఫ్ఘనిస్థాన్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. గ్రూప్ దశ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ధీటుగా రాణించి లక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చారు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా కూడా బుమ్రాకు మంచి మద్దతు ఇస్తుండగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారి ప్లే-11లో చోటు ద‌క్కించుకున్న‌ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఆకట్టుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమిని ఎదుర్కొంది. భారత్‌పై బంగ్లా జట్టు సమర్థవంతంగా రాణించలేకపోతే.. వారికి సెమీ పైన‌ల్‌ తలుపులు మూసుకున్న‌ట్లే. బంగ్లాదేశ్ గ్రూప్ దశలో శ్రీలంక, నేపాల్, నెదర్లాండ్‌లను ఓడించి సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గతంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20లో చాలా క్లోజ్ మ్యాచ్‌లు జరగడంతో మరోసారి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శనివారం ఆంటిగ్వాలో వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉండటం భారత అభిమానులకు ఉపశమనం కలిగించే విషయం. వాతావరణ శాఖ ప్రకారం.. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవ‌కాశం త‌క్కువ‌. రోజంతా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని పేర్కొంది. దీంతో 40 ఓవర్ల ఆట జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత జట్టు సెమీఫైనల్ అవ‌కాశాలు మరింత బలపడతాయి.

Tags:    

Similar News