BCCI : మంచి ప‌నే.. కానీ, అదే జ‌రిగితే బీసీసీఐకి భారీ న‌ష్టం..!

భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో పొగాకు ఉత్పత్తుల ప్రకటనలు తరచుగా స్టేడియంలలో క‌న‌బ‌డ‌తాయి

Update: 2024-08-02 05:09 GMT

భారత్‌లో క్రికెట్(CRICKET) మ్యాచ్‌ల సమయంలో పొగాకు ఉత్పత్తుల ప్రకటనలు తరచుగా స్టేడియంలలో క‌న‌బ‌డ‌తాయి. అయితే.. ఈ ప్రకటనలు పొగాకు ఉత్పత్తులను నేరుగా చూపించవు.. కానీ పొగాకుతో అనుసంధానం అయిన ఉత్పత్తుల కోసం మాత్రం ప్రచారం చేస్తాయి. దీనిపై తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(డీజీహెచ్ఎస్‌) బీసీసీఐకి ఓ సూచ‌న చేసింది. భారత్‌లోని క్రికెట్ స్టేడియాల‌లో పొగాకు, మద్యపానాన్ని ప్రోత్సహించే ప్రకటనలను తొలగిస్తామని.. దీని కోసం BCCI చర్యలు తీసుకోవాలని కోరింది.

ఆట‌గాళ్లు మ‌న దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యువతకు రోల్ మోడల్స్‌ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన, చురుకైన, ఉత్పాదక జీవనశైలిని ప్రోత్సహించడంలో ఆటగాళ్లు, ముఖ్యంగా క్రికెటర్లు యువతకు రోల్ మోడల్స్(RoleModels) అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సాయ్ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్‌లకు గురువారం రాసిన లేఖలో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ పేర్కొన్నారు.

డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు.. ప్రముఖ క్రికెటర్లు, ప్రముఖ పొగాకు లేదా మద్యానికి సంబంధించిన ప్రకటనలు (tobacco advertisement) చేయడం నిరాశపరిచిందన్నారు. క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్(IPL) వంటి క్రికెట్ ఈవెంట్‌ల సమయంలో క్రికెట్ క్రీడను ప్రోత్సహించడానికి విధానాలు, ఫ్రేమ్‌వర్క్, మార్గదర్శకాలను రూపొందించండి అని బిసిసిఐని కోరారు. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటే.. పొగాకు లేదా ఆల్కహాల్‌కు సంబంధించిన ప్రకటనలు చేయకుండా ఆటగాళ్లను నిషేధించేందుకు సానుకూల చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఐపీఎల్ వంటి బిసిసిఐ క్రీడా ఈవెంట్ల స‌మ‌యంలో అటువంటి ప్రకటనలను అనుమతించవద్దని అభ్యర్థించారు. దీనిపై బీసీసీఐ స్పందించాల్సివుంది. నిషేదం మంచి నిర్ణ‌య‌మైన‌ప్ప‌టికీ.. ఇదే జ‌రిగితే.. ప్ర‌క‌ట‌న‌ల ద్వారా బీసీసీఐకి వ‌చ్చే కోట్ల రూపాయ‌ల ఆదాయం న‌ష్ట‌పోక త‌ప్ప‌దు. 

Tags:    

Similar News