BCCI : టీమిండియాకు రూ.125 కోట్ల రివార్డును ప్రకటించిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్ విజేతలైన జట్టు సభ్యులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డులను ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ విజేతలైన జట్టు సభ్యులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డులను ప్రకటించింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి ఈ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. 11 ఏళ్ల తర్వాత భారత జట్టుకు ఇది తొలి ఐసీసీ టైటిల్.
టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టుకు బీసీసీఐ సెక్రటరీ జే షా రూ.125 కోట్ల రివార్డును ప్రకటించారు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024లో విజేతగా నిలిచిన భారత జట్టుకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను అని X లో జే షా రాశారు. టోర్నమెంట్‌లో జట్టు అసాధారణ ప్రతిభ, సంకల్పం, నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయానికి ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది అందరికీ అభినందనలు అని రాసుకొచ్చారు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ చారిత్రాత్మక టైటిల్‌ను గెలుచుకున్నదని.. తమ అసాధారణ ఆటతీరుతో విమర్శకుల నోరు మూయించిందని బీసీసీఐ సెక్రటరీ జే షా కొనియాడారు. "రోహిత్ శర్మ యొక్క అసాధారణ నాయకత్వంలో జట్టు అద్భుతమైన సంకల్పం కనబరిచింది, ఐసిసి టి 20 ప్రపంచ కప్ చరిత్రలో టోర్నమెంట్‌ను అజేయంగా గెలుచుకున్న మొదటి దేశంగా భారతదేశం నిలిచింది" అని జే షా ఒక ప్రకటనలో తెలిపారు. జట్టు తన స్థిరమైన అద్భుతమైన ప్రదర్శనలతో విమర్శకుల నోరు మూయించిందన్నారు.
జట్టు కృషిని కూడా కొనియాడారు. జట్టు తన అంకితభావం, కృషి, స్ఫూర్తితో ప్రతి ఒక్కరినీ గర్వించేలా చేసిందని అన్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలో.. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఇతర ఆటగాళ్ల సహాయంతో వారు 1.4 బిలియన్ల భారతీయుల కలలు, అంచనాలను నెరవేర్చారని అన్నారు.