Savitri Vratham 2024 : ఈ రోజు వట సావిత్రి వ్రతం.. మహిళలు ఎందుకు చేసుకుంటారంటే..?

జ్యేష్టమాసంలో కూడా మహిళలు చేసుకునే అనేక వ్రతాలు, నోములు ఉంటాయి. చాంద్రమానం ప్రకారం మూడవ మాసం జ్యేష్టం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు.

By :  Eha Tv
Update: 2024-06-21 07:06 GMT

జ్యేష్టమాసంలో కూడా మహిళలు చేసుకునే అనేక వ్రతాలు, నోములు ఉంటాయి.

చాంద్రమానం ప్రకారం మూడవ మాసం జ్యేష్టం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. అందుకే ఈ నెలకు జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది. సకల శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన మాసం ఇది. ఈ మాసంలో కొన్ని నియమాలను, విధులను పాటిస్తే పుణ్యఫలాలను పొందవచ్చు. వైశాఖం(Vyshakham) విష్ణువుకు, కార్తీకం(Karthikam) శివుడికి ఎలా ప్రీతిపాత్రమైనవో అలాగే జ్యేష్టం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రియమైనది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. నీటి కడవనుగానీ(Clay pot), నీటితో నింపిన బిందెనుగానీ దానంగా ఇవ్వాలి. దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. హైందవ సంస్కృతి లో, ఆధ్యాత్మిక జీవన విధానములో స్త్రీ పురుషులకు భేదం లేదు. అయితే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసం పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా ధైవారాధన చేస్తారు. కుటుంబ క్షేమం కోసం మహిళలు చేసే ఉపవాస దీక్షలలో వట సావిత్రీ వ్రతం(Savitri vratham) కూడా ఒకటి. పతివ్రత శిరోమణి అయిన సావిత్రి తన భర్త ప్రాణాలను యమ ధర్మరాజు నుంచి వెనక్కి తెచ్చుకుంది. సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు మరణిస్తే పవిత్ర వృక్షమైన మర్రిచెట్టును సావిత్రి భక్తిప్రపత్తులతో పూజించింది. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. యమధరమరాజు ఆమెను మరలి పొమ్మని ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఎన్ని వరాలు ఇచ్చినా తన భర్త ప్రాణాలే కావాలన్నది. యముడు రకరకాలుగా ప్రయత్నించినా తల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇస్తాడు. పెళ్లయిన మహిళలంతా వటసావిత్రీ వ్రతం రోజున కొత్త దుస్తులు ధరంచి, చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రిచెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సిందూరంతో వటవృక్షాన్ని అలంకరించి, నూలుదారం పోగుల్ని చెట్టుమొదలు చుట్టూకడతారు. చెట్టుచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మర్రి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్లు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాస స్థలములు. మర్రిచెట్టుకు మహిళలు పసువు కుంకుమలతో పూజిస్తారు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. మర్రి కొమ్మకింద ఎలా నీడను పొందుతారో ఆ చెట్టులాగే తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటారు. మహిళలు ఈ రోజున ఉపవాసం ఉంటారు. కొందరు చంద్రున్ని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు . కొందరు ఒక పూట భోజనం చేస్తారు ... మరికొందరు పండ్లు మాత్రమే తీసుకుంటారు. వట సావిత్రీ వత్రం చేసేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు వేకువ జామునే నిద్రలేచి తల స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపు తో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మను వైధవ్యాధి సకల దోష పరిహారార్ధం. బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం-సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ-వట సావిత్రీ వ్రతం కరిష్యే అనే శ్లోకాన్ని పఠించాలి.

Tags:    

Similar News