Karnataka : సీఎం సిద్ధరామయ్య ఎందుకు రాజీనామా చేయాలి.? కర్ణాటకలో ఏం జ‌రుగుతుంది.?

కర్ణాటక రాజకీయాలు మ‌ళ్లీ వేడెక్కాయి. సీఎం సిద్ధరామయ్యపై కుంభకోణం ఆరోపణలు రావ‌డంతో రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది

Update: 2024-08-18 04:00 GMT

కర్ణాటక రాజకీయాలు మ‌ళ్లీ వేడెక్కాయి. సీఎం సిద్ధరామయ్యపై కుంభకోణం ఆరోపణలు రావ‌డంతో రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. భూకేటాయింపు కుంభకోణం (ముడా స్కామ్)లో సిద్ధరామయ్యపై విచార‌ణ‌కు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ గందరగోళం అంతా చెలరేగింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం కోసం గవర్నర్ పనిచేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)లో 'భూ కేటాయింపు కుంభకోణం'కు సంబంధించి సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలపై విచార‌ణ‌కు దర్యాప్తు సంస్థలకు గవర్నర్ గెహ్లాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఆరోపణలపై బీజేపీ దూకుడు వైఖరిని అవలంబించింది. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అవుతోంది. ఈ ఆరోపణల నుండి బయటపడటం దానికి అతిపెద్ద సవాలుగా మారనుంది.

అయితే.. సుదీర్ఘ పోరాటానికి సిద్ధమని సిద్ధరామయ్య కూడా సూచించారు. విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య బీజేపీకి పలు ప్రశ్నలు సంధించారు. నేను ఎందుకు రాజీనామా చేయాలో బీజేపీ చెప్పాలని సీఎం అన్నారు. నేను చేసిన నేరం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తున్నందున నా అభిప్రాయం ప్రకారం.. గవర్నర్‌ రాజీనామా చేయాలని సిద్ధరామయ్య అన్నారు.

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో సిఎం సిద్ధరామయ్య భార్య పార్వతికు సంబంధించి మైసూర్‌లోని ఒక పోష్ ఏరియాలో ముడాకు కేటాయించిన ఆమె భూమి కంటే.. పరిహారంగా ఎక్కువ భూమిని కేటాయించారు.. రూ.4 వేల కోట్ల కుంభకోణం అని బీజేపీ ఆరోపిస్తోంది.

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా గవర్నర్ చర్యను "రాజ్యాంగ విరుద్ధం" అని అభివర్ణించారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధరామయ్యకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

గవర్నర్‌ను తొలగించాలంటూ బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు ‘గవర్నర్‌ను తొలగించండి.. రాష్ట్రాన్ని కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు.

న్యాయమైన దర్యాప్తునకు తన ఉత్తర్వు అవసరమని, స్కాం జరిగినట్లు చార్జిషీట్‌లో తేలిందని తాను ప్రాథమికంగా భావిస్తున్నానని గవర్నర్ అన్నారు. ముఖ్యమంత్రికి జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని, ప్రాసిక్యూషన్ మంజూరు కోసం చేసిన దరఖాస్తును తిరస్కరించాలని సూచించిన మంత్రి మండలి.. నిర్ణయం కూడా తప్పు అని గెహ్లాట్ పేర్కొన్నారు.

Tags:    

Similar News