Cyber ​​Fraud : 'నేను CJI చంద్రచూడ్‌ని.. రూ. 500 పంపండి'.. సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పేరిట సైబర్ ఫ్రాడ్

సైబర్ ఫ్రాడ్ వార్తలు ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారుతున్నాయి. అయితే ఢిల్లీలో ఓ ఉదంతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది

Update: 2024-08-28 04:04 GMT

సైబర్ ఫ్రాడ్ వార్తలు ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారుతున్నాయి. అయితే ఢిల్లీలో ఓ ఉదంతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేరుతో రాజధానిలో మోసం జరుగుతోంది. సైబర్ దుండగుల ధైర్యం ఎంతగా పెరిగిపోయిందంటే.. ఏకంగా దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానమైన సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పేరును వాడుతూ రూ.500 డిమాండ్ చేస్తున్నారు.

మెసేజ్‌లు, కాల్‌లు చేసి ప్రజలను మోసం చేసిన ఎన్నో కేసులు విన్నాం. ఇప్పుడు సీజేఐ పేరుతో ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇందులో క్యాబ్ బుక్ చేసుకోవడానికి డబ్బులు అడుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రకారం.. హాయ్, నేను CJI ను.. ముఖ్యమైన కొలీజియం సమావేశాన్ని కలిగి ఉన్నాను. నేను కన్నాట్ ప్లేస్‌లో చిక్కుకున్నాను. మీరు క్యాబ్ కోసం రూ. 500 పంపగలరా.? కోర్టుకు చేరిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని మెసేజ్‌లో రాసి ఉంది. ఈ వైరల్ పోస్ట్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు అధికారులు సైబర్ మోసంపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

నేరగాళ్లు ఉపయోగించే పలు డిజిటల్ పద్ధతులకు బాధితులుగా మారి లక్షల రూపాయలు పోగొట్టుకున్న అనేక సైబర్ మోసాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆర్‌బిఐ 'డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్'ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇది చెల్లింపు మోసాల ప్రమాదాలను తగ్గించడానికి నూత‌న‌ సాంకేతికత కలిగి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 30న విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకులు నివేదించిన ఆర్థిక మోసాల సంఖ్య గణనీయంగా పెరిగింది, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 166 శాతం పెరిగి 36,075 కేసులకు చేరుకుంది. 

Tags:    

Similar News