Students Cheating : స్టూడెంట్లకు గైడ్లు ఇచ్చి పరీక్షలు రాయిస్తున్న లెక్చరర్లు..
విద్యార్థులకు చదువులు చెప్పడంతోనే అధ్యాపకుల బాధ్యత అయిపోదు! వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. దేశానికి వన్నె తెచ్చే విధంగా వారిని సన్మార్గంలో నడిపించాలి.
విద్యార్థులకు చదువులు చెప్పడంతోనే అధ్యాపకుల బాధ్యత అయిపోదు! వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. దేశానికి వన్నె తెచ్చే విధంగా వారిని సన్మార్గంలో నడిపించాలి. అలాగే అధ్యాపకులు చెప్పింది శ్రద్ధగా విని జ్ఞానాన్ని సముపార్జించవలసిన కర్తవ్యం విద్యార్థులది. అయితే మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని మొరెనాలో ఇందుకు విరుద్ధంగా ఉన్నారు అధ్యాపకులు, విద్యార్థులు. బీఏ, బీఎస్సీ పరీక్షలు రాసిఉన్న విద్యార్థులు కానివ్వండి, రాయిస్తున్న అధ్యాపకులు కానివ్వండి తమ బాధ్యతను విస్మరించారు. మొరెనాలోని కేఎస్ హయ్యర్ సెకండరీ హైస్కూల్‌లోని పరీక్షా కేంద్రంలో శనివారం చోటు చేసుకున్న సంఘటన చూసి ఆకస్మిక తనిఖీకి వెళ్లిన తహసీల్దార్ చూసి బిత్తరపోయారు. విద్యార్థులు గైడ్‌లు పెట్టి మరీ పరీక్షలు రాస్తున్నారు. నివారించాల్సిన లెక్చరర్లు దగ్గరుండి రాయిస్తున్నారు. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు తహసీల్దార్ జ్యోతి లక్షాకర్. ఆ వీడియోను ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఈ కాపీయింగ్ ఘటనపై విచారణ జరిపించనున్నట్లు అధికారులు తెలిపారు.