Next CPI(M) general secretary : సీతారాం ఏచూరి వారసుడు ఎవరు.?

సీతారాం ఏచూరి మరణానంతరం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) తదుపరి ప్రధాన కార్యదర్శి కోసం అన్వేషణ సాగుతోంది.

Update: 2024-09-26 15:32 GMT

సీతారాం ఏచూరి మరణానంతరం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) తదుపరి ప్రధాన కార్యదర్శి కోసం అన్వేషణ సాగుతోంది. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో సీతారాం వారసుడు ఎవరనేది ఖరారు కానుంది.

1964లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నుంచి విడిపోయి ఉనికిలోకి వచ్చిన సీపీఐ(ఎం) ఆరు దశాబ్దాల చరిత్రలో ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండగానే మరణించడం ఇదే తొలిసారి. సీపీఐ(ఎం)లో అత్యున్నత పదవి ప్రధాన కార్యదర్శి. పొలిట్‌బ్యూరో సభ్యులు సలహాదారులుగా వ్యవహరిస్తారు.

76 ఏళ్ల ప్రకాష్ కారత్ సీపీఐ(ఎం)పై విస్తృత ప్రభావం చూపారు. మూడుసార్లు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వృద్ధాప్యం లేకుంటే ఆయ‌న ఈ ప‌ద‌వికి ప్ర‌ధాన‌ పోటీదారుగా ఉండేవారు. కానీ సీపీఐ(ఎం) రాజ్యాంగం ప్రకారం.. ఏ వ్యక్తిని మూడుసార్లకు మించి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకూడ‌దు. ప్రకాష్ కారత్ కాకుండా మొహమ్మద్ సలీం, బృందా కారత్, మాణిక్ సర్కార్ వంటి సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు.

బృందా కారత్ వయసు 76 ఏళ్లు దాటింది. మొహమ్మద్ సలీం బెంగాల్‌లో సీపీఐ(ఎం) కార్యదర్శి. గ‌తంలో లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా తృణమూల్‌పై ఎవరైనా సీపీఐ(ఎం)కి ప్రాధాన్యం ఇవ్వగలిగితే అది సలీం మాత్రమే.

త్రిపురలో సీపీఐ(ఎం) అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. తిరిగి అధికారంలోకి రావడానికి మాణిక్ నుంచి రాష్ట్రంలోనే సమర్థవంతమైన నాయ‌క‌త్వ ప‌టిమ‌ను ఆశిస్తోంది. అదీకాక.. ఆయన ఆరోగ్యం కూడా దేశం మొత్తానికి నాయకత్వం వహించే విధంగా లేదు.

కేరళ ముఖ్యమంత్రి పి విజయన్‌కు సన్నిహితుడైన ఎంవి గోవిందన్ కూడా ప్రధాన పోటీదారుగా ఉన్నారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో గోవిందన్ సీపీఐ(ఎం) కార్యదర్శిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఆయ‌న‌ అవసరం కేరళలో ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నాయకుల్లో మహారాష్ట్రకు చెందిన అశోక్ ధావలే, కేరళకు చెందిన ఎంఏ బేబీ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, పినరయి విజయన్, ఎంవీ గోవిందన్, బృందా కారత్, మాణిక్ సర్కార్, మహ్మద్ సలీం, సూర్యకాంత్ మిశ్రా, బి.వి. రాఘవులు, తపన్ కుమార్ సేన్, నీలోత్పల్ బసు, జి. రామకృష్ణన్, సుభాషిణి అలీ, ఎ విజయరాఘవన్‌లు ఇప్పటికే రేసులో ఉండ‌గా.. ఎంఏ బేబీ, రామచంద్ర దోమ్, అశోక్ ధావలేల పేర్లు కూడా తాజాగా తెర పైకి వ‌చ్చాయి.

Tags:    

Similar News