NEET Scam : నీట్‌ పరీక్షలో అక్రమాలు ... పరీక్షా కేంద్రాలపై పలు అనుమానాలు

నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలు, పేపర్‌ లీకులపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

By :  Eha Tv
Update: 2024-06-26 07:28 GMT

నీట్‌ పరీక్ష(NEET Exam)లో జరిగిన అక్రమాలు, పేపర్‌ లీకుల(Paper Leake)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తును చిదిమేసిన నీట్‌ ఎగ్జామ్‌ను రద్దు చేసి మళ్లీ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే నీట్‌ అక్రమాలకు ఈ ఏడాదే తెరలేచిందా? ఇంతకు ముందు కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలు సహేతుకమైనవే! కారణమేమిటంటే మొదటిసారి నీట్ పరీక్ష రాసి లక్షలలో ర్యాంకులు సాధించిన కొందరు విద్యార్థులు రెండోసారి మాత్రం అనూహ్యంగా మెరుగైన ర్యాంకులు సాధించడమే! అయితే విద్యార్థుల టాలెంట్‌పై సందేహించడం మంచిది కాదు. మొదటిసారి బాగా చదవకపోవచ్చు. రెండోసారి కష్టపడి చదివి ఉండవచ్చు. ఇక్కడే తిరకాసు ఉంది. మొదటిసారి లక్షలలో ర్యాంకు వచ్చి రెండోసారి వేలల్లో ర్యాంకు తెచ్చుకున్నవారు నగరాలకు దూరంగా మారుమూల పట్టణ ప్రాంతాల్లోని ఎగ్జామ్‌ సెంటర్‌లలో పరీక్షలు రాయడమే పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా(Times Of India)లో వివరణాత్మక కథనం వచ్చింది. ముంబాయి(Mumbai)లోని ఎల్‌టీఎంజీ సియాన్‌ హాస్పిటల్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న ఓ విద్యార్థిని ఎగ్జాంపుల్‌గా చూపించింది. ఆమె మొదటిసారి 2022లో నీట్‌ పరీక్ష రాసినప్పుడు రెండు లక్షలకుపైగానే ర్యాంకు వచ్చింది. రెండోసారి 2023లో నీట్‌ పరీక్ష రాసినప్పుడు ఆమె ర్యాంకు 8 వేల లోపే ఉంది. అదే విధంగా ముంబాయిలోనే ప్రభుత్వ హాస్పిటల్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న మరో విద్యార్థినికి 2022లో 10 లక్షలకు పైగా ర్యాంకు వస్తే , 2023లో మాత్రం రెండో ప్రయత్నంలో 13వేల ర్యాంకు వచ్చింది. వీరు తాము ఉంటున్న నగరాలలో ఎగ్జామ్‌ రాయకుండా దూరంగా ఉన్న చిన్న పట్టణాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్‌ రాయడంతోనే అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు కర్ణాటకలోని బెళగావి సమపంలో ఎగ్జామ్‌ రాస్తే మరికొందరు బీహార్‌ రాజధాని పాట్నాకు కొంత దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో పరీక్ష రాశారు. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించిందట! అంటే నీట్‌ అక్రమాల వ్యవహారంలో కొన్ని ఎగ్జామ్‌ సెంటర్ల పాత్ర కూడా ఉందని అర్థమవుతోంది. గుజరాత్‌(Gujarat)లోని గోద్రా(Godhra)లో నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయని అక్కడి పోలీసులు బయటపెట్టారు. ముందు తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయమని, తెలియనివాటిని ఏమీ రాయకుండా వదిలేయమని విద్యార్థులకు చెప్పారట! తర్వాత పేపర్లను ప్యాక్‌ చేసే ఆర గంట ముందు విద్యార్థుల పేపర్లపై పరీక్ష కేంద్రం డిప్యూటీ సూపరింటెండెంట్‌ జవాబులు రాయాలనుకున్నారని పోలీసులు గుర్తించారు. గోద్రా పరీక్ష కేంద్రాన్ని సమీప ప్రాంతాల విద్యార్థులు ఎంచుకున్నారంటే అర్థముంది కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా గోద్రాకు వచ్చే పరీక్ష రాయడమే ఆశ్చర్యకరం!నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలు, పేపర్‌ లీకులపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News