Atishi Hunger Strike : నీళ్ల కోసం మంత్రి నిరాహార దీక్ష.. ఆరోగ్యం క్షీణించడంతో..

ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిషి ఆరోగ్యం గ‌త‌ రాత్రి క్షీణించింది.

By :  Eha Tv
Update: 2024-06-25 02:52 GMT

ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిషి ఆరోగ్యం గ‌త‌ రాత్రి క్షీణించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు అతిషిని అర్థరాత్రి లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (LNJP) వైద్యుల వద్దకు తీసుకెళ్లారు.

ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. అతిషి షుగ‌ర్ లెవెల్స్‌ పడిపోయాయి. వైద్యులు పరీక్షించి ఆ తర్వాతే ఏదైనా సలహా ఇస్తారని పేర్కొన్నారు.

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్‌ 43కి చేరుకుంది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రిలో చేరకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అతిషి గత ఐదు రోజులుగా ఏమీ తినలేదు. అందుకే షుగ‌ర్ లెవెల్స్ పడిపోయాయి, కీటోన్లు పెరుగుతున్నాయి. రక్తపోటు తగ్గుతోంది. ఆమె తన కోసం పోరాడడం లేదు.. ఢిల్లీ ప్రజల కోసం.. నీటి కోసం పోరాడుతోందని అన్నారు.

నాలుగు రోజుల దీక్ష నేప‌థ్యంలో అతిషి 2.2 కిలోల బరువు తగ్గారు. ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సూచించారు. సోమవారం లోక్‌నాయక్‌ ఆస్పత్రి వైద్యులు అతిషి ఆరోగ్యాన్ని పరిశీలించారు. పరీక్షల అనంతరం ఆమె బరువు తగ్గుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చేర్చాలని కోరినప్పటికీ మంత్రి నిరాహార దీక్ష విరమించేందుకు నిరాకరించారు.

ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు అని వైద్యులు తెలిపారు. నిరాహార దీక్ష నాలుగో రోజుకు 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. ఆమె రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది ప్రమాదకరమని వైద్యులు పేర్కొన్నారు. దీంతోపాటు మంత్రికి మూత్రం కీటోన్ స్థాయి పెరుగుతోంది.

జంగ్‌పురా, భోగల్‌లో జలమండలి మంత్రి అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారం నాలుగో రోజు కొనసాగింది. దీక్ష కేంద్రం నుండి ప్రజలకు సందేశం ఇస్తూ.. తన ఆరోగ్యం ఎంత క్షీణించినా.. దీక్ష చేయాలనే తన సంకల్పం బలంగా ఉంటుందని చెప్పారు. ఢిల్లీకి అదనపు నీరు వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు.

ఢిల్లీలో నీటి కొరత ఉన్నందున తాను నిరాహార దీక్ష చేస్తున్నానని అతిషి తెలిపారు. ఢిల్లీకి సొంత నీళ్లే లేవని.. ఇక్కడి నీళ్లన్నీ పక్క రాష్ట్రాల నుంచి వస్తాయని,. అయితే గత 3 వారాలుగా హర్యానా ఢిల్లీకి నీళ్లు పంపడం తగ్గించిందని పేర్కొన్నారు. 100 ఎంజిడి నీరు అంటే 46 కోట్ల లీటర్ల నీరు అని.. ఇవి ఒక్కరోజులో 28 లక్షల మందికి ఉపయోగపడుతాయ‌న్నారు. సరిపడా నీరు లేకపోవడంతో ప్రతి నీటి బొట్టు కోసం 28 లక్షల మంది ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు.

నీటి డిమాండ్‌పై ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ మంత్రులు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అలాగే వజీరాబాద్ బ్యారేజీని సంయుక్తంగా సందర్శించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు భోగల్‌లోని జలమండలి మంత్రి అతిశీ నిరవధిక నిరాహార దీక్ష స్థలంలో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానమంత్రికి లేఖ రాయాలని, లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి వజీరాబాద్‌లో పర్యటించాలని నిర్ణయించారు.

ఈ ఏడాది తీవ్రమైన ఎండ‌ల‌ కారణంగా ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొందని ప్రధానికి లేఖ రాశారు. దీంతో ఢిల్లీ ప్రజలు నీటిబొట్టు కోసం తహతహలాడుతున్నారు. ఎండల కార‌ణంగా ఢిల్లీ వాసులకు నీటి అవసరం కూడా పెరిగింది. ఢిల్లీకి అదనపు నీరు కావాలి. నీటి కోసం ఢిల్లీ పూర్తిగా హర్యానా, ఉత్తరప్రదేశ్‌లపైనే ఆధారపడి ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే.. పెద్ద మొత్తంలో నీరు అందక.. హర్యానా నుంచి కేటాయించిన నీటిని కూడా ఢిల్లీ ప్రజలు పొందలేకపోతున్నారు.

ఢిల్లీలో మొత్తం నీటి సరఫరా 1,005 ఎంజీడీలు అని లేఖలో రాశారు. ఇందులో ప్రధాన భాగం 613 MGD నీరు హర్యానా నుండి వస్తుంది. ఢిల్లీకి చాలా రోజులుగా 100 ఎంజీడీల తక్కువ నీరు వస్తోంది. దీంతో 28 లక్షల మందికి నీరు అందడం లేదు. నీటి కొరతను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. హర్యానా ముఖ్యమంత్రికి లేఖ రాసి, కేంద్ర జల మంత్రిని కలిసేందుకు ప్రయత్నించి, హిమాచల్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. యమునా నదిలో హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చే నీటిని ఢిల్లీకి అదనంగా ఇవ్వడానికి హిమాచల్ సిద్ధంగా ఉంది. కానీ హర్యానా ఆ నీటిని కూడా ఇవ్వడానికి నిరాకరిస్తోంది.

Tags:    

Similar News