Wayanad Landslides : కేరళలో ప్రకృతి బీభత్సం.. 143 మంది మృతి
కేరళ వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడట ఘటనలో ఇప్పటివరకూ 143 మంది మరణించారని.. మరో 130 మంది గాయపడ్డారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కేరళ వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడట ఘటనలో ఇప్పటివరకూ 143 మంది మరణించారని.. మరో 130 మంది గాయపడ్డారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మంగళవారం నాలుగు గంటల వ్యవధిలో వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో సహా పలు ఏజెన్సీలు, సైన్యం సహాయక చర్యల నిమిత్తం రంగంలోకి దిగాయి. శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తులను కనుగొనడానికి రెస్క్యూ ఆపరేషన్లు ఈ ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. తప్పిపోయిన వ్యక్తుల సంఖ్యను గుర్తించడానికి జిల్లా అధికారులు బుధవారం డేటాను సేకరించడం ప్రారంభించారు.
జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌కు చెందిన ప్రత్యేక బృందం ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి సంఖ్య, కొండచరియలు విరిగిపడిన తరువాత కనుగొనబడిన వారు.. తప్పిపోయిన వ్యక్తుల సంఖ్యపై డేటాను క్రోడీకరిస్తుందని వార్తా సంస్థ PTI నివేదించింది.
వాయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల, అత్తమాల, నూల్‌పుజా జిల్లాల్లో పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయి. చలియార్ నదిలో పలువురు కొట్టుకుపోయారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం.. జిల్లాలో శాశ్వత వంతెన కొట్టుకుపోవడంతో.. ఆర్మీ 1,000 మందికి పైగా ప్రజలను రక్షించింది. వాయనాడ్‌లో మొత్తం 45 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇక్కడ 3,069 మందికి వసతి కల్పించామని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో వైద్య బృందాలతో సహా మొత్తం 225 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు తిరువంతపురంలో దాదాపు 140 మంది ఆర్మీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వార్తా సంస్థ ANI నివేదించింది. రెండు వైమానిక దళ హెలికాప్టర్లు Mi-17, ALH (అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్) కూడా రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం ఉపయోగిస్తున్నారు.