LK Advani : క్షీణించిన అద్వానీ ఆరోగ్యం.. ఎయిమ్స్‌లో చేరిక
బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. 96 ఏళ్ల అద్వానీ బుధవారం అర్థరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.
బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. 96 ఏళ్ల అద్వానీ బుధవారం అర్థరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనను ఎయిమ్స్‌లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వయో సంబంధ సమస్యల కారణంగా మాజీ ప్రధాని ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని సమాచారం.
అద్వానీ 2014 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన ఇంటికి వెళ్లి ఆయనను కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
పాకిస్థాన్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8న హిందూ సింధీ కుటుంబంలో జన్మించిన అద్వానీకి ఈ ఏడాది భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసింది. 2015లో ఆయన భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను కూడా అందుకున్నారు.
అద్వానీ 1998-2004 మధ్య బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో హోం మంత్రిగా పనిచేశారు. లాల్ కృష్ణ అద్వానీ 2002-2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో భారతదేశానికి ఏడవ ఉప ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు. 10వ, 14వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించారు.