Kuwait fire : కువైట్‌ అగ్ని ప్రమాదం.. మృతుల సంఖ్య నిర్ధారణ కాలేదు!

కువైట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. మృతుల లెక్కపై స్పష్టత వస్తే తప్ప ఎంతమంది చనిపోయారనేది తెలియదు.

By :  Eha Tv
Update: 2024-06-13 09:57 GMT

కువైట్‌లో(Kuwait) జరిగిన ఘోర అగ్ని(Fire) ప్రమాదంలో(Accident) 49 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. మృతుల లెక్కపై స్పష్టత వస్తే తప్ప ఎంతమంది చనిపోయారనేది తెలియదు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతున్న ప్రకారం 41 మంది భారతీయులు చనిపోయారు. అయితే ఎంత మంది చనిపోయారు? అందులో భారతీయులు ఎందరు? వాళ్ల పేర్లు, ఎక్కడివారు, ఇతర వివరాలు ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు అగ్ని ప్రమాద సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించడానికి ప్రధాని నరేంద్రమోదీ(Narendramodi) ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్‌ సింగ్‌(Keerthivardhan) కువైట్‌ బయల్దేరారు. ప్రమాదంలో చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి గుర్తుపట్టలేనంతగా ఉన్నాయని, మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయని కీర్తివర్దన్‌ సింగ్‌ చెప్పారు.

ఎయిర్‌ఫోర్స్‌ విమానం కూడా సిద్ధంగా ఉందని, మృతదేహాలను గుర్తించిన వెంటనే ఎయిర్‌ పోర్స్‌ విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తామని తెలిపారు. ఆ ఘోర అగ్ని ప్రమాదంలో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారు. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడమే పెను విషాదం. కువైట్‌ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్‌ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. మొదట వంటగది నుంచి మంటలు వ్యాపించాయని, ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నారని అధికారులు అంటున్నారు. ఎన్‌బీటీసీ గ్రూప్‌ అనే నిర్మాణ సంస్థలో పని చేయడం కోసం వివిధ దేశాల నుంచి వలస కార్మికులు వచ్చారు. వారి వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనట! అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కార్మికులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు. కువైట్‌ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం అంటే ఇంచుమించు పది లక్షల వరకు ఉంటారు. ఆ దేశంలోని మొత్తం కార్మికులలో 30 శాతం మంది భారతీయులే! మాంగాఫ్‌ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్‌ ఉప ప్రధానమంత్రి షేక్‌ ఫహద్‌ అల్‌–యూసుఫ్‌ అల్‌–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కల్పించని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అగ్నిప్రమాదానికి బాధ్యులైన పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Tags:    

Similar News