Lata Mangeshkar Award : ప్ర‌ముఖ గాయని చిత్రకు లతా మంగేష్కర్ అవార్డు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందించే జాతీయ లతా మంగేష్కర్ అవార్డుకు ప్ర‌ముఖ‌ నేపథ్య గాయని కేఎస్ చిత్ర ఎంపికయ్యారు.

Update: 2024-08-21 04:23 GMT

మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందించే జాతీయ లతా మంగేష్కర్ అవార్డుకు ప్ర‌ముఖ‌ నేపథ్య గాయని కేఎస్ చిత్ర ఎంపికయ్యారు. ఆమెతోపాటు ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉత్తమ్ సింగ్ ను కూడా ఈ అవార్డుకు ఎంపిక జేసింది జ్యూరీ. సెప్టెంబరు 28న జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు మంగళవారం ఓ అధికారి ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రతి సంవత్సరం దిగ్గ‌జ‌ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఈ అవార్డును అందజేస్తుంది.

2022 సంవత్సరానికి గాను ఉత్తమ్‌సింగ్‌కు ల‌తా మంగేష్కర్ అవార్డును ప్రదానం చేయనుండ‌గా.. KS చిత్రకు 2023 సంవత్సరానికి గాను అవార్డు ఇవ్వబడుతుందని ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ డైరెక్టర్ జయంత్ భిసే ధృవీకరించారు. ఇటీవల నిర్మిత‌మై లతా మంగేష్కర్‌కు అంకితం చేసిన ఆడిటోరియంలో తొలిసారిగా ఈ అవార్డుల వేడుక జరగనుంది. ఆమె జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీనిని నిర్మించింది.

లతా మంగేష్కర్ 28 సెప్టెంబర్ 1929న ఇండోర్‌లో జన్మించారు. ఆమె 92 సంవత్సరాల వయస్సులో 6 ఫిబ్రవరి 2022 న మరణించారు. భారతీయ సంగీతంలో ఆమె చెరగని ముద్ర వేశారు. సంగీతంలో విశిష్ట సేవ‌ల‌ను అందిస్తున్న వారిని 1984 నుంచి ఈ పురస్కారంకు ఎంపిక చేస్తున్నారు. ఈ పురస్కారం కింద‌ రూ. 2 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అంద‌జేస్తారు. 

Tags:    

Similar News